మూసీకి పోటెత్తిన వరద
భూదాన్‌పోచంపల్లి, వలిగొండ: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. దీంతో పాటు హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హుసేన్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ ఉరకలు వేస్తోంది. బుధవారం ఉదయం నుంచి భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు–రుద్రవెల్లి లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మూసీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ మార్గంలో భూదాన్‌పోచంపల్లి నుంచి బీబీనగర్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీబీనగర్, భువనగిరికి వెళ్లడానికి వయా పెద్దరావులపల్లి, పిలాయిపల్లి, మక్తఅనంతారం మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. వాహనాలను దారి మళ్లించారు.


