
రోడ్డు ప్రమాదాలను తగ్గించాల్సిందే
సాక్షి,యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రాణాలను కాపడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. రోడ్డు భద్రతపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే అన్ని శాఖల మధ్య సమన్వయంతో తప్పనిసరి అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని,బ్లాక్ స్పాట్‌లను గుర్తించి సూచిక బోర్డులు, రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని స్పష్టం చేశారు. వాహనాల వేగ పరిమితిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ధర్మోజిగూడెం క్రాస్ రోడ్డు, కొయ్యలగూడెం బస్టాప్, వలిగొండ ఎక్స్ రోడ్డు, అనంతారం బ్రిడ్జి, మోత్కూర్–పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఈ రవీందర్, రోడ్లు భవనాల అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు