
ముగ్గురు కవులకు సాహిత్య పురస్కారాలు
రామగిరి(నల్లగొండ): ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. నార్కట్‌పల్లి మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు.
అద్భుత సాహిత్యం శ్రీరామోజు రఘు సొంతం
ఆచార్య డా. శ్రీరామోజు రఘు అద్భుతమైన సాహిత్యానికి కేరాఫ్ అని చెప్పవచ్చు. ఈయన అధ్యయనం, అధ్యాపనం, విమర్శ, కవిత్వం, పాఠ్య ప్రణాళిక రూపకల్పనా శిల్పి. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రఘు ఎన్జీ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలోనే తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు భారతీయాంగ్ల కవిత్వంలో అస్తిత్వ వేదన అనే అంశంపై ఎంఫిల్, ఆధునిక కవిత్వంలో అంతర్ముఖీనత అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. అనేక జాతీయ, అంతర్జాతీయ సాహిత్య సదస్సుల్లో పాల్గొని 60కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆయన రచించిన సమన్వయ విమర్శ గ్రంథానికి రాష్ట్రస్థాయిలో మూడు అవార్డులు లభించాయి. కథ, కవిత్వం, నవల నాటక మొదలైన భిన్న ప్రక్రియల్లో ఆయన వ్యాసాలు రచించారు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ ప్రకటించిన కీర్తి పురస్కారం–2024కు సాహిత్య విమర్శ రంగంలో ఆయన ఎంపికయ్యారు.
తెలుగు మమకారి సాగి కమలాకరశర్మ
ఆచార్య డా. సాగి కమలాకరశర్మకు తెలుగు భాష అంటే అమితమైన మమకారం. ఆయన స్వస్థలం నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం. డిగ్రీ వరకు సైన్స్ చదువుకుని తెలుగుపై ఉన్న మమకారంతో ఎంఏ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. సంస్కృతం, ఇంగ్లిష్, జ్యోతిష్యం, యోగా, తత్త్వశాస్త్రాల్లో ఎంఏ పూర్తిచేశారు. తెలుగు యూనివర్సిటీ జ్యోతిష్య విభాగంలో 10 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశారు. 2007లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం తెలుగు శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 13కు పైగా గ్రంథాలు రచించారు. వివిధ పత్రికల్లో 300లకు పైగా వ్యాసాలు, 100పైగా పత్ర సమర్పణలు చేశారు. రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పురస్కారం వంటివి 10కిపైగా అందుకున్నారు. ఈయన పర్యవేక్షణలో 14 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టా పొందారు. మూసీ సాహిత్య ధార, జ్యోతిర్వాణి, వేద సంస్కృతి పరిషత్ వంటి సంస్థలను స్థాపించి నేటి సమాజానికి సాహిత్యాన్ని అందిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యానికి విశేష కృషి చేస్తున్నందుకు గాను తెలంగాణ సారస్వత పరిషత్తు వారి సాహిత్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
ఆర్తి వచన కవిత్వంలో ప్రసిద్ధుడు
బైరెడ్డి కృష్ణారెడ్డి
బైరెడ్డి కృష్ణారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తిచేశారు. 34 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశారు. ఎన్జీ కళాశాలలో డిగ్రీ అధ్యాపకుడిగా పదవీ విరమణ పొందారు. ఆర్తి అనే పేరుతో 4 కవిత్వ సంపుటాలు ప్రచురితమయ్యాయి. దీంతో పాటు మరో రెండు సంపుటాలు వెలువడనున్నాయి. ఇంగ్లిష్ లెక్షరర్ అయిన కృష్ణారెడ్డికి తెలుగు సాహిత్యంలో మానవీయ బంధాలు, ఆర్థ్రత కలిగిన కవిత్వం రాసే కవి అని పేరు. ప్రతిష్టాత్మకమైన తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం–2024కు ఎంపికయ్యారు.

ముగ్గురు కవులకు సాహిత్య పురస్కారాలు

ముగ్గురు కవులకు సాహిత్య పురస్కారాలు