
అతివల ఆరోగ్యానికి అభయం
సద్వినియోగం చేసుకోవాలి
ఆలేరు: మారుతున్న జీవనశైలి.. వాతావరణ మార్పుల కారణంగా మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈనేపథ్యంలో అతివల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్దవేట వేసింది. కుటుంబ వ్యవస్థలో అతి కీలకంగా వ్యవహరించే మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి తద్వారా ఆ కుటుంబం.. దేశాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో శ్రీస్వస్థ్‌నారీ..సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు వైద్యారోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలతో ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.
భువనగిరి జనరల్ ఆస్పత్రిలో ప్రారంభం
‘స్వస్థ్‌నారీ..సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని భువనగిరిలోని జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఇదే ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు.
అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ క్యాంపులు
ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ మందిరాలు, భువనగిరిలోని జనరల్ ఆసుపత్రి, బస్తీ దవాఖానాల పరిధిలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
సేవలు ఇవీ..
● వైద్యశిబిరాల్లో నేత్ర, దంత, చర్మ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, డెర్మటాలజీ, సైక్రియాట్రిస్ట్ వైద్యనిపుణులు పాల్గొని సేవలందిస్తారు.
● బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, హిమోగ్లోబిన్, నేత్ర, గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేస్తారు. అవసరమైన మందులను అక్కడికక్కడే అందజేస్తారు.
● 0నుంచి ఐదేళ్ల చిన్నారులకు టీకాలు వేయనున్నారు.
17నుంచి ‘స్వస్థ్‌నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’
ఫ 16 రోజులు, 80 వైద్యశిబిరాలు
ఫ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వైద్య పరీక్షలు
ఆరోగ్య కేంద్రాలు 21
సామాజిక ఆరోగ్య
కేంద్రాలు 03
ఆయుష్మాన్
మందిరాలు 99
బస్తీ దవాఖానాలు 04
జనరల్ ఆస్పత్రి 01
ప్రతి రోజూ జిల్లాలో ఆస్పత్రుల పరిధిలో ఐదు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. మహిళలతో పాటు చిన్న పిల్లలకు కూడా పరీక్షలు చేస్తారు. అనారోగ్య సమస్యలు, పౌష్టికాహార లోపాలను గుర్తిస్తారు. పౌష్టికాహార లోపం ఉన్న వారిని నల్లగొండలోని న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీ)కు, ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలను చికిత్స కోసం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు రెఫర్ చేస్తాం.
– డాక్టర్ యశోధ, నోడల్ అధికారి

అతివల ఆరోగ్యానికి అభయం