
తొమ్మిది మండలాల్లో వర్షం
భువనగిరిటౌన్, యాదగిరిగుట్ట, ఆలేరు : జిల్లాలోని తొమ్మిది మండలాల్లో శుక్రవారం మోస్త రు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యాదగిరిగుట్టలో 60 మి.మీ, చౌటుప్పల్‌లో 59 మి.మీ వర్షం కురిసింది. వర్షానికి భువనగిరిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వ జూనియర్ కాళాశాల ఎదుట రహదారిపై, సింగన్నగూడెం చౌరస్తా, కోర్టు పక్కన గల్లీలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు, వీధి వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. అదే విధంగా యాదగిరిగుట్టలో ప్రధాన రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. వైకుంఠద్వారం ఎదుట ఫ్లైఓవర్ పైనుంచి వర్షపునీరు కిందికి పడటంతో జలపాతాన్ని తలపించింది.సెంట్రల్ పార్కింగ్, రింగ్ రోడ్డు ప్రాంతాల్లోనూ వర్షం నీరు నిలిచింది.యాదగిరికొండపైన భక్తులు జర్మన్ టెంట్‌లు, మండపాల్లో తలదాచుకున్నారు. ఆలేరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు, కాలనీలతో పాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ఈ సీజన్‌లో ఇదే భారీ వర్షం
వానాకాలం ప్రారంభం తరువాత భారీ వర్షం కురువడం ఇదే మొదటిసారి. సీజన్ ఆరంభంనుంచి ఆశించిన వానలు లేక దిగులు చెందుతున్న రైతులకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. మెట్ట పంటలకు ఊపిరిపోశాయి. రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఫ అత్యధికంగా గుట్టలో 60 మి.మీ
ఫ భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్టలో లోతట్టు ప్రాంతాలు జలమయం
ఫ రోడ్లపై వరద ప్రవాహం..రాకపోకలకు అంతరాయం
మండలాల వారీగా
వర్షపాతం (మి.మీ)
చౌటుప్పల్ 59
యాదగిరిగుట్ట 60
భువనగిరి 53
తుర్కపల్లి 30
బి.రామారం 33
బీబీనగర్ 26
ఆలేరు 37
వలిగొండ 16
రామన్నపేట 10

తొమ్మిది మండలాల్లో వర్షం

తొమ్మిది మండలాల్లో వర్షం