
యంత్రాల సాయంతో అధిక దిగుబడులు సాధ్యం
త్రిపురారం: రైతులు యంత్రాల సాయంతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాదించవచ్చని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలం కంపాసాగర్‌లోని వరి పరిశోధనా స్థానంలో ఉమ్మడి జిల్లాలోని రైతులకు వ్యవసాయంలో నేరుగా పొడి దుక్కిలో వరి విత్తనాలు విత్తే విధానం, దమ్ము చేసిన పొలంలో నేరుగా డ్రోన్ సహయంతో విత్తనాలు చల్లే పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోజురోజుకు కూలీల కొరత రైతులకు ఇబ్బందిగా మారిందని, వరి విత్తనాలు నేరుగా చల్లడం వలన కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. సకాలంలో వరి విత్తనాలను యంత్రాలతో విత్తుకోవడం వల్ల సమయం కూడా ఆదా అవుతుందన్నారు. శాస్త్రవేత్తల సహాయంతో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా రైతులు సాగు చేపట్టాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవాలని అన్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వరి నారు పెంచడం, రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, వరి సాగులో సస్యరక్షణ చర్యలపై సమగ్రంగా వివరించారు. అనంతరం వరి విత్తనాలు నేరుగా దుక్కిలో విత్తే యంత్రం, డోన్ ద్వారా విత్తే పద్ధతులపై శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో యంత్రాలు చూపించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం ప్రఽ దాన శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య, హాలియా సహాయ వ్యవసాయ సంచాలకురాలు సరిత, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహాన్, శాస్త్రవేత్తలు సంధ్యారాణి, నళిని, స్వాతి, ఏఈఓ నాగరాజు, వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
ఎకరానికి 6కిలోల విత్తనం సరిపోతుంది..
వరి పంటను నేరుగా విత్తేందుకు గాను ఎకరానికి 6కిలోల విత్తనం సరిపోతుందని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య సూచించారు. యంత్రాల సాయంతో ఎకరం పొలంలో 10 నుంచి 15 నిమిషాల్లో వరి విత్తనాలు విత్తుకోవచ్చన్నారు. వరి పరిశోధనా స్థానం కంపాసాగర్‌లో గత రెండళ్ల నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో నేరుగా వరి విత్తే పద్ధతి, డ్రోన్ సహాయంతో విత్తే పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో రైతులు వరిని నేరుగా విత్తుకోవచ్చని, రైతులు యాంత్రీకరణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫ నల్లగొండ జిల్లా వ్యవసాయ
అధికారి శ్రవణ్‌కుమార్
ఫ ఉమ్మడి జిల్లా రైతులకు వరి విత్తనాలు విత్తే విధానంపై అవగాహన

యంత్రాల సాయంతో అధిక దిగుబడులు సాధ్యం