
పదోన్నతుల తర్వాతే సర్దుబాటు!
భువనగిరి : స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించిన తర్వాతనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. సర్దుబాటు నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.
అర్హులు 150 మంది
జిల్లాలోఎస్‌జీటీలు 1,105, స్కూల్ అసిస్టెంట్లు 1,640 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లలో సీనియార్టీని బట్టి జీహెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు అఅర్హులను గుర్తిస్తున్నారు. 2002 డిసెంబర్ నాటికి ఉద్యోగంలో చేరిన వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. 150 మంది జీహెచ్‌ఎంలు పదోన్నతికి అర్హులుగా గుర్తించారు. సర్దుబాటు ప్రక్రియ మల్టీజోన్–2 ప్రకారం జరగనుంది. ప్రస్తుతం జిల్లాలో 30 జీహెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సర్దుబాటు
తొలుత స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో, ఆ తర్వాత జిల్లాలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యా శాఖ నిబంధన విధించింది. గతనెల 12 నాటికి సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే బడిబాట కార్యక్రమం అనంతరం సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈనెల 15లోగా సర్దుబాటు పూర్తి చేయనున్నారు.
ఒకే దఫా పూర్తిచేయాలి
రాజాపేట: బదిలీలతో కూడిన ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేసి ఒకే దఫా ప్రక్రియ ముగించాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి సీవి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో గురువారం రాజాపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించారు. రాజాపేటలో ఆయన మాట్లాడుతూ ఐదు డీఏలు పెండింగ్ ఉంచడం బాధాకరమన్నారు. పీఆర్సీ అమలు చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం చెల్లించాలని, టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు పలుగుల రాజు, నమిలే భరత్‌కుమార్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుడుకు జానయ్య , పున్న సత్యానంద్, కార్యదర్శి బాలరాజు పాల్గొన్నారు.
ఫ జిల్లాలో 1,640 మంది స్కూల్ అసిస్టెంట్లు
ఫ ఉన్నతాధికారులకు నివేదిక అందజేత