
అభాగ్యులను ఆదుకునేలా..
కుటుంబ పెద్ద చనిపోతే ‘ఎన్‌ఎఫ్‌బీఎస్’ కింద రూ.20 వేల ఆర్థికసాయం
సాక్షి, యాదాద్రి : పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం–ఎన్‌ఎఫ్‌బీఎస్) అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు సరిపడా నిధులుండడంతో ఐదేళ్లుగా మరుగున పడిన ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ గతనెలలో జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రైతులు, చేనేత కార్మికులు, వివిధ వృత్తుల వారి ఇంటి పెద్ద చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థికసాయం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ నేతృత్వంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో అర్హత కలిగిన వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ఆర్థిక సహాయం మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంది. మంజూరైన వారికి త్వరలో ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు.
అర్హతలు ఇవే..
కుటుంబ యజమాని వయసు 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉండాలి. మరణ, వయసు ద్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్, తెల్ల రేషన్‌కార్డు జతచేయాలి. అలాగే ఆర్థిక సహాయం పొందగోరె వారి గుర్తింపు పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌తో అనుసంధానం అయిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా నంబర్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జతపర్చాలి. మండలాల్లోనైతే తహసీల్దార్, పట్టణాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను విచారణ జరిపి అర్హత ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా సెర్ప్ సీఈఓ కార్యాలయానికి పంపుతారు. అక్కడి పరిశీలన చేసిన అనంతరం లబ్ధిదారులను ఓకే చేసి చనిపోయిన కుటుంబ యజమాని నామినీ ఖాతాల్లో రూ.20వేలు జమ చేస్తారు.
దరఖాస్తులు ఇలా..
జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో 620 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో బీసీలు 378, ఎస్సీలు 179, ఓసీలు 36, ఎస్టీలు 27 మంది ఉన్నారు. ఈనెలలో భాగంగా బుధవారం నాటికి మరో 225 మంది దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీల నుంచి అతి తక్కువగా ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు నుంచి ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైంది. మండలాల్లో మోటకొండూరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మలరామారం మండలాల నుంచి అధికంగా మంజూరయ్యాయి. అయితే దరఖాస్తులకు చివరి తేది అంటూ గడువు లేకపోవడంతో అర్హులు తమ అర్జీలను అందజేస్తూనే ఉన్నారు.
ఫ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పక్కాగా అమలుకు సెర్ప్ సీఈఓ ఆదేశం
ఫ అర్జీలు స్వీకరిస్తూ ఆర్థికసాయం
మంజూరు చేస్తున్న యంత్రాంగం
ఫ నామినీ ఖాతాల్లో జమ అవుతున్న నిధులు
ఫ జూన్‌లో 620 కుటుంబాలకు లబ్ధి
జూన్‌లో ఆర్థికసాయం మంజూరు వివరాలు
నారాయణపురం 29
పోచంపల్లి 17
రాజాపేట 59
రామన్నపేట 30
వలిగొండ 36
యాదగిరిగుట్ట 46
మున్సిపాలిటీల్లో మంజూరు
ఆలేరు 63
భువనగిరి 02
చౌటుప్పల్ 19
మోత్కూరు 20
పోచంపల్లి 02
యాదగిరిగుట్ట 02
మండలం మంజూరైన
లబ్ధిదారలు
అడ్డగూడూరు 10
ఆలేరు 36
భువనగిరి 21
ఆత్మకూర్(ఎం) 30
బీబీనగర్ 20
బొమ్మలరామారం 34
చౌటుప్పల్ 10
గుండాల 23
తుర్కపల్లి 14
మోటకొండూరు 68
మోత్కూరు 29
అర్హులంతా అర్జీ పెట్టుకోండి
60 ఏళ్లలోపు వయసు ఉన్న కుటుంబ యజమాని చనిపోతే రూ.20 వేల ఆర్థిక సాయం కోసం ఎన్‌ఎఫ్‌బీఎస్‌కు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ నెలలో 620 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. బుధవారం నాటికి మరో 225 దరఖాస్తులు వచ్చాయి.
– వీరారెడ్డి, అదనపు కలెక్టర్

అభాగ్యులను ఆదుకునేలా..