
భూ యజమానులకు నోటీసులు జారీ
బీబీనగర్: బీబీనగర్ మండల పరిధిలో రైల్వే డబ్లింగ్ పనుల కోసం భూ యజమానులకు రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. బీబీనగర్ మండల గూడూరు గ్రామం నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు వరకు రైల్వే మార్గంలో జరుగనున్న నడికుడి డబ్లింగ్ పనులకు ఇటీవల భూ సేకరణ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా గూడూరు, పగిడిపల్లి, భువనగిరి, నాగిరెడ్డిపల్లి, నందనం, అనాజిపురం, బొల్లేపల్లి గ్రామాల పరిధిలో రైల్వే ట్రాక్ వెంట గల భూ యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులను జారీ చేయడంతో పాటు సర్వే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో 800 ఎకరాలకుపైగా భూ సేకరణ జరుగనుంది.
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
భువనగిరిటౌన్ : వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోవృద్ధుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ నాయకులు మందడి ఉపేందర్ పాల్గొన్నారు.
ఆటాపాటలతో చదువు నేర్చుకోవాలి
భువనగిరి : దివ్యాంగ విద్యార్థులు ఆటాపాటలతో చదువు నేర్చుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని భవిత కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 66 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా బోధనాభ్యాసన పరికరాలను అందజేసి మా ట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విలీన విద్యా జిల్లా సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, విలీన విద్యా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా నిత్యకల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కల్యాణ వేడుకను అర్చకులు నేత్ర పర్వంగా నిర్వహించారు. శ్రీస్వామి వారి ప్రధానాలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం ముఖమండపంలో అష్టోత్తర పూజలు చేపట్టారు. రాత్రి శయనోత్సవం జరి పించి, ద్వార బంధనం చేశారు.

భూ యజమానులకు నోటీసులు జారీ