
లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తే కేసులు తప్పవు
సాక్షి, యాదాద్రి : భువనగిరిలో అనుమతిలేని ఆస్పత్రులు నడవడంతోపాటు లింగనిర్ధారణ పరీక్షలు చేసే సెంటర్లపై విచారణ చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. మూడు రోజుల క్రితం భువనగిరిలో లింగనిర్ధారణ పరీక్షలతో పాటు, ఇద్దరు గర్భిణులకు గర్భస్రావం చేసిన సంఘటపై సీరియస్ అయ్యారు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం అనుమతి రద్దు చేసిన ఆస్పత్రికి మరో పేరుతో అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మాదాపూర్, వలిగొండ, ఆలేరు, మోత్కూరు ఇలా పలు చోట్ల ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడస్తుంటే కఠిన చర్యలు ఎందుకు సిఫార్సు చేయడం లేదని వైద్యారోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ప్రఽశ్నించారు. లింగనిర్ధారణ పరీక్షలు, ఆనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నడపడం, అర్హతలేని డాక్టర్లతో వైద్యం చేయడాన్ని అడ్డుకోవడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సమాచారం.
ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి
వలిగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రభుత్వ ఆర్థికసాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏ ఈ కిరణ్, ఏపీఎం జాని, ఏపీఓ పరుశరాములు, కార్యదర్శి తదతరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు