
సకాలంలో బస్సులు నడపాలని రాస్తారోకో
రాజాపేట : సకాలంలో బస్సులు నడపాలని కోరుతూ రాజాపేటలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం స్థానిక గాంధీ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొండ్రెడ్డిచెరువు, పుట్టగూడెం గ్రామాలకు చెందిన సుమారు 60 మందికిపైగా విద్యార్థులం రాజాపేటలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నామని తెలిపారు. తాము మా గ్రామాల నుంచి పాఠశాలలకు వచ్చేందుకు ఉదయం 7గంటలకు ఒకసారి, సాయంత్రం 5గంటలకు యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు ఉందని, అది ఉదయం వేళలో సమయానికి బస్సు నడుస్తున్నా సాయంత్రం మాత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని వాపోయారు. స్థానిక నాయకులు చొరవ చూపి యాదగిరిగుట్ట డిపో అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.