
ఆగిరెడ్డి భూమిని సందర్శించిన తహసీల్దార్
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో రైతు ఆగిరెడ్డి తనకు గల రెండెకరాల మూడు గుంటల భూమి ఇతరుల పేరున మారిందని సోమవారం కలెక్టర్ చాంబర్‌లో పెట్రోల్ పోసుకున్నాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు బాధిత రైతు ఆగిరెడ్డి భూమిని మంగళవారం సందర్శించారు. బాధిత రైతు తన భూమిగా పేర్కొంటున్నా హద్దులు గుర్తించలేకపోతున్నాడని, దీంతో 340, 345, 346 సర్వే నంబర్లలోని భూమిని సర్వే చేయించి తన భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిపారు. బాధిత రైతు విన్నపం మేరకు సదరు సర్వే నంబర్లలోని రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే ప్రక్రియ నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఐ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్, రైతులు ఉన్నారు.