
అర్హత లేకున్నా వైద్యం
ల్యాబ్‌ను సీజ్ చేయాలని నోటీసులు
జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆస్పత్రిలో ఈ నెల 6న ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7న విచారణ అనంతరం ఆస్పత్రికి సంబంధించిన డాక్టర్ శివకుమార్‌ను రిమాండ్‌కు తరలించగా డాక్టర్ గాయత్రి, ల్యాబ్ నిర్వాహకుడు పాండు, ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఆస్పత్రితో పాటు ల్యాబ్‌ను సీజ్‌చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పట్టణ పోలీసులు నోటీసులు పంపించారు. అదేవిధంగా సంజాయిషీ ఇవ్వాలని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ల్యాబ్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.
భువనగిరి: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చాలా వరకు ఆస్పత్రులు ఏర్పాటు చేసే సమయంలో అర్హత ఉన్న వైద్యుల సర్టిఫికెట్స్ పెట్టి అనుమతులు పొందుతున్నారు. అనంతరం వారి స్థానంలో అర్హతలేని వైద్యుల ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆస్పత్రిలో మహిళలకు అబార్షన్లు చేసిన ఘటనపై జరిపిన విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలో సుమారు 200 ప్రైవేట్ ఆస్పత్రులు
జిల్లా వ్యాప్తంగా సుమారు అనుమతులు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు 200 వరకు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరులో ఉన్నాయి. ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుగా ఏడు శాఖల అనుమతులు తీసుకున్న అనంతరం చివరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉండాలి. అనుమతి తీసుకునే సమయంలో ఎవరి సర్టిఫికెట్స్ పెట్టారో వారు మాత్రమే ఆస్పత్రిలో వైద్య సేవలందించాలి. కానీ ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి తీసుకున్న వారు కాకుండా అర్హతలేని వైద్యులు వైద్య సేవలందిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు అబార్షన్లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తుర్కపల్లి, ఆలేరు, మాదాపూర్, బొమ్మలరామారం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గుర్తించి ఆస్పత్రులను సీజ్ చేశారు. కానీ నిర్వాహకులు తిరిగి వక్రమార్గంలో ఆస్పత్రులను తెరిచి సేవలందించడం పరిపాటిగా మారింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్ పీఎన్‌డీటీ ప్రత్యేక బృందం గల అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలను నామమాత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అదేబాటలో స్కానింగ్ సెంటర్లు
జిల్లాలో ఆస్పత్రులతో పాటు స్కానింగ్ సెంటర్లలో కూడా అర్హత లేని వారిచే స్కానింగ్ పరీక్షలు చేయిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకునే వారు ల్యాబ్ టెక్నీషియన్ అర్హత కలిగి ఉండాలి. కానీ అర్హత కలిగి ఉన్న వారితో అనుమతి పొందిన తర్వాత అర్హత లేని వారు పరీక్షలు చేస్తున్నారు.
అనుమతి లేకున్నా అబార్షన్లు
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెసీ (ఎంటీపీ) చట్టం ప్రకారం మహిళలు సురక్షితమైన గర్భస్రావ సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే ఆస్పత్రుల్లో గర్భస్రావం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ సర్టిఫికెట్ 16 ప్రైవేట్ ఆస్పత్రులకు ఉంది. కానీ సర్టిఫికెట్ లేకున్నా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భస్రావాలు చేస్తున్నారు.
ఫ నిబంధనలకు విరుద్ధంగా
వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల
నిర్వాహకులు
ఫ అనుమతులు తీసుకునేది ఒకరు.. వైద్యం చేసేది మరొకరు
ఫ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న
వైద్యాధికారులు