
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): మామ అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి.. తన బావమర్దితో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన మోరపాక భిక్షం అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. భిక్షం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అతడి అల్లుడు మోనంది ఐలయ్య(55) గురువారం సూర్యాపేట నుంచి గట్టికల్లుకు వచ్చాడు. కొన్ని కారణాల వల్ల గురువారం భిక్షం అంత్యక్రియలు పూర్తికాలేదు. కాగా గురువారం రాత్రి 8గంటల సమయంలో మోనంది ఐలయ్య తన బావమరిది(మృతుడి కుమారుడు) మోరపాక రాములు(45)తో కలిసి పని నిమిత్తం టీవీఎస్ మోపెడ్‌పై గట్టికల్లు నుంచి నెమ్మికల్లుకు వెళ్తున్నారు. అదే సమయంలో గట్టికల్లు గ్రామానికే చెందిన కోన వినోద్ తన తల్లి, కుమారుడితో కలిసి సూర్యాపేట నుంచి బైక్‌పై గట్టికల్లుకు వస్తున్నాడు. ఈ క్రమంలో నెమ్మికల్లు–గట్టికల్లు గ్రామాల మధ్య వినోద్ తన బైక్‌తో ఎదురుగా వస్తున్న ఐలయ్య టీవీఎస్ మోపెడ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐలయ్య, రాములుకు తీవ్ర గాయాలు కాగా.. వినోద్ తల్లి లక్ష్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐలయ్య, రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఐలయ్య, సాయంత్రం రాములు మృతిచెందారు. మృతుడు మోనంది ఐలయ్య స్వగ్రామం గట్టికల్లు కాగా.. 15 ఏళ్లుగా సూర్యాపేటలో నివాసముంటున్నాడు. ఐలయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మోరపాక రాములు భార్య గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. రాములుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బైక్‌తో ఢీకొట్టి ఐలయ్య, రాములు మృతికి కారణమైన వినోద్‌పై కఠిన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు శుక్రవారం వినోద్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గట్టికల్లు గ్రామానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒక్కరోజు వ్యవధిలో మృతిచెందడంతో గట్టికల్లు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఫ రోడ్డు ప్రమాదంలో
బావ, బావమర్ది మృతి

అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..