
నూతన ఆలోచనా దృక్పథం అవసరం
నల్లగొండ టూటౌన్: నూతన ఆలోచనా దృక్పథం ప్రతి విద్యార్థికి అవసరమని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూలో శుక్రవారం విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల వినూత్న ఆలోచనకు క్రమశిక్షణ తోడైతే శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చన్నారు. సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు నివేద, శ్రీచరణ్ తేజ మేధో సంపత్తి హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐపీఆర్ సెల్ డైరెక్టర్ దోమల రమేష్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. ప్రేమ్‌సాగర్, రామచందర్ గౌడ్, మద్దిలేటి, తిరుమల, శాంతకుమారి, మచ్ఛేందర్ పాల్గొన్నారు.
సాగర్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌ను శుక్రవారం కేంద్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం, పర్యవేక్షణ నిర్వహణ బృందం సభ్యులు సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన డ్యాంను సందర్శించిన అనంతరం బుద్ధవనంలోని బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధ చరిత వనం, ధ్యానవనం, జాతకవనం, స్థూపవనాలను సందర్శించారు. మహాస్థూపం రెండో అంతస్తులో ధ్యాన మందిరంలో బుద్ధ భగవానుడి వద్ద బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన ఈ బృందంచే బుద్ధజ్యోతిని వెలిగించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివరాలను, బుద్ధవనం విశేషాలను వివరించారు. ఈ బృందంలో నావెల్ ప్రకాష్, అభిషేక్ విశ్వాస్, బీపీ యాదవ్, సందీప్‌కుమార్, బీఆర్ సలేమాన్, బీపీఎం మోహన్‌రెడ్డి, రెవెన్యూ ప్రొటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.