
తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్
సూర్యాపేటటౌన్: ఆస్తి వివాదంలో కన్న తండ్రిని హత్య చేసిన నిందితుడిని శుక్రవారం మోతె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ విలేకరులకు వెల్లడించారు. మోతె మండలం నాగయ్యగూడేనికి చెందిన నిమ్మరబోయిన వెంకన్నకు 4.29 ఎకరాల భూమి ఉంది. ఐదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో తీర్మానం చేసి వెంకన్న తన పేరిట ఎకరం, ఇద్దరు కుమారులకు చెరొక ఎకరంన్నర, కుమార్తెకు 29 గుంటల భూమి వాటాలు వేసి పంచుకున్నారు. అయితే ఈ భూమిని పట్టా చేయలేదు. వెంకన్న తన వాటాకు వచ్చిన ఎకరం భూమిని తనకు అప్పులు అయ్యాయని అమ్ముకున్నాడు. దీంతో వెంకన్నపై అతడి పెద్ద కుమారుడు గంగయ్య కోపం పెంచుకొని ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం గంగయ్య తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో తన తండ్రి వెంకన్న సూర్యాపేట నుంచి నాగయ్యగూడేనికి టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తుండటం గమనించాడు. అదే సమయంలో గంగయ్య తన తలకు హెల్మెట్ ధరించి తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో తండ్రి వెంకన్నపై దాడి చేసి పారిపోయాడు. వెంకన్నను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంకన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మోతె పోలీసులు శుక్రవారం గంగయ్యను మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి గొడ్డలి, హెల్మెట్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.