మద్దతు ధరకు కోత
కొనుగోలుకు మిల్లర్ల వెనుకంజ
సాక్షి, భీమవరం : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది ఖరీఫ్ రైతుల పరిస్థితి. సాగు చివరిలో మోంథా, దిత్వా తుపాన్లు పంటకు నష్టం కలిగిస్తే.. ఎఫ్‌సీఐ కోటాలో బ్రోకెన్ (నూకల) పర్సంటేజీని 10 శాతానికి తగ్గించిన సీఎంఆర్ కొత్త నిబంధనలు రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నాయి. రైతుల నుంచి పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. దీనిలో కొంత ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగిలిన బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కోసం పౌరసరఫరాలశాఖ తీసుకుంటుంది. ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యంలో నూకల పర్సంటేజీ గతంలో 25 శాతం ఉండేది. ఈ సీజన్ నుంచి 10 శాతం నూకలు మాత్రమే ఉండాలన్న నిబంధన తెచ్చారు. మిగిలిన 15 శాతం నూకలకు తిరిగి టెండర్ ప్రక్రియ నిర్వహించే వరకు మిల్లర్ల వద్దే భద్రపరచాలి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 770 వరకు రైస్‌మిల్లులున్నాయి. వీటిలో గంటకు ఐదు టన్నుల నుంచి 10 టన్నులకు పైగా మిల్లింగ్ కెపాసిటీ కలిగిన పెద్ద మి ల్లులు 45 శాతం ఉండగా, మిగిలినవి ఐదు టన్నులలోపు సామర్థ్యంతో నడిచే చిన్న మిల్లులు. ఇవి ఎ క్కువగా సీఎంఆర్‌పైనే ఆధారపడతాయి. వీటికి గో డౌన్, బాయిల్డ్ సదుపాయం అంతంత మాత్రమే. ఈ తరుణంలో నూకలు నిల్వ చేయడం తలకు మించిన భారం కానుంది. ఇవి త్వరగా తుట్టెలు కట్టి పాడయ్యే అవకాశం ఉండటం వలన సకాలంలో టెండర్లు పూర్తయి తరలించకపోతే నష్టపోవాల్సి వస్తుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు, చలిగాలులతో తగ్గని తేమ శాతం
ప్రభుత్వం క్వింటాల్‌కు కామన్ వైరెటీ రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి రూ.2,389 ధర నిర్ణయించింది. ఈ ధర పొందేందుకు ధాన్యంలో తేమశాతం 17 లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే నూకలు పెరుగుతాయి. మాసూళ్లు ముమ్మరంగా జరుగుతు న్న తరుణంలో దిత్వా తుపాను కారణంగా వర్షాలు పడ్డాయి. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండి ధాన్యంలో తేమ శాతం 20కి పైగా ఉంటోంది. సాధారణంగా 17 శాతానికి మించి తేమ ఉన్నప్పుడు రైతులు, మిల్లర్లు నష్టపోకుండా పైన ఒక శాతానికి క్వింటాల్‌కు కిలో చొప్పున ధాన్యాన్ని తరుగుగా మినహాయిస్తారు. ప్రస్తుతం 19 నుంచి 22 వరకు తేమశాతం ఉంటున్న నేపథ్యంలో అదనంగా ఉన్న ఒక్కో శాతానికి మద్దతు ధర మేరకు కిలో చొప్పున ధర తగ్గించి మిగిలిన మొత్తం రైతుకు చెల్లించాలి. మద్దతు ధర ప్రకారం కిలో ధాన్యం ధర రూ.23.29. ఈ మేరకు 19 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రెండు కిలోల సొమ్ము తగ్గించి రూ.2,282, తేమ 20 శాతం ఉంటే 2,259, తేమ 22 శాతం ఉంటే రూ.2,212 చొప్పున చెల్లించాలి.
నూకల పర్సంటేజీ 25 నుంచి 10 శాతానికి తగ్గింపు
తుపానుల ప్రభావంతో దెబ్బతిన్న ధాన్యం నాణ్యత
తేమ పెరిగి 40 శాతం వరకు ఉంటున్న నూకలు
క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్న రైతులు
ఎఫ్‌సీఐ నూకల నిబంధనల నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు వెనుకడుగేస్తున్నారు. నూకల పర్సంటేజీ పెరిగి నష్టపోవాల్సి వస్తుందని ఉబ్బడాల పేరిట బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు కోత పెడుతున్నట్టు తెలుస్తోంది. తేమ 17 శాతానికి రావాలంటే రెండు మూడు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టాలి. పశ్చిమగోదావరి జిల్లాలో 1.12 లక్షల మంది రైతులు 2.11 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుచేశారు. 6.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా స్థానిక వినియోగం, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు పోను ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. 215 ఆర్‌ఎస్‌కేల ద్వారా దాదాపు 1.7 లక్షల టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రతికూల వాతావరణానికి జడిసి చాలామంది రైతులు ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. రవాణా, హమాలీ ఖర్చులకు బస్తాకు సుమారు రూ.50 కాగా ప్రస్తుతం ఎవరికివారు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో ఉండటంతో జట్టు కొరత పేరిట రూ.80 నుంచి రూ.90 వరకు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు బస్తాకు రూ.30 నుంచి రూ.40 వరకు రైతులు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.


