ఎగసిపడుతున్న అలలు.. ఆందోళనలో రైతులు
నరసాపురం రూరల్: తుపాను పేరు చెబితే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికంది వచ్చే సమయంలో తుపాను హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న చిరుజల్లులతో పంట నష్టపోకుండా ఒబ్బిడి చేసుకుంటున్నారు. సోమవారం పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లోని ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడం, కోసిన వరిని ఒబ్బిడి చేసుకునే దృశ్యాలే కనిపించాయి. ఈ ఏడాది సాగుచేపట్టిన రైతులు ఆరంభంలో అధిక వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. పంట చివరి దశలో వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తుతున్నారు.
ఆదివారం రాత్రి నుంచి వీస్తున్న చలిగాలులు, వర్షాలకు యంత్రాలతో కోతలు కోసి ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని ఒడ్డుకు చేరుస్తున్నారు. నరసాపురం నియోజకవర్గవ్యాప్తంగా వరిసాగు చేసిన రైతులు తుపాను నుంచి గట్టెక్కించాలని దేవుడికి మొక్కుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం కూడా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్లు తీర ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు జాగ్రత్తలు సూచించారు.
ఎగసిపడుతున్న అలలు.. ఆందోళనలో రైతులు
ఎగసిపడుతున్న అలలు.. ఆందోళనలో రైతులు


