అర్జీలు పునరావృతం కావొద్దు
కలెక్టర్ నాగరాణి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, హౌసింగ్ జిల్లా అధికారి జి.పిచ్చయ్య, జిల్లా చేనేత శాఖాధికారి కె.అప్పారావు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● పంచారామ క్షేత్రంలో దర్శనం సమయంలో ఈఓ రామకృష్ణంరాజు తన భుజంపై చేయి వేసి గెంటేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారని భీమవరానికి చెందిన దివ్యాంగురాలు లక్ష్మీకుమారి ఫిర్యాదు చేశారు. ఈఓకు మెమో జారీ చేయాలని జేసీ ఆదేశించారు.
● పాలకొల్లు 10 వార్డు సిద్దిలగూడెంలో గోవులను అక్రమంగా వధించి మాంసం రవాణా చేస్తున్నా రని, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు.
● తాడేపల్లిగూడెం 6వ వార్డుకు చెందిన ఎస్‌కేకే మస్తాన్‌బీబీ తనకు అప్పారావుపేటలో 50 సెంట్ల భూమి ఉందని, ఇటీవల సర్వేలో 11 సెంట్ల భూమి తగ్గిందని, రీసర్వే చేయించాలని కోరారు.
● పెంటపాడు మండలం బి.కొండేపాడుకి చెందిన పంచాయతీ ఎలక్ట్రీషియన్ కనకాల యేసు తనకు ఆరు నెలలుగా జీతం రావడం లేదని, జీతం ఇప్పించాలని అభ్యర్థించారు.
● ఉండి మండలం ఉప్పుగుంటకి చెందిన మద్ద ఆనందకుమారి చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో తమ కుటుంబాన్ని వెలి వేశారని, న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.
● పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన కురిమిల్లి సింహాచలం కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిన కారణంతో వృద్ధాప్య పెన్షన్ నిలిపివేశారని, తిరిగి మంజూరు చేయాలని కోరారు.


