‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి..
కుమారుడికి తలకొరివి పెట్టిన మాతృమూర్తి
పాలకొల్లు సెంట్రల్: తల్లంటే పేగు బంధం.. తనువును చీల్చుకుని బిడ్డలకు ప్రాణం పోస్తుంది.. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది.. వారి ఎదుగుదలలో ఆనందం పొందుతుంది.. అలాంటి మాతృమూర్తి వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మరణంతో తల్లడిల్లిపోయింది.. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడి చితికి నిప్పు పెట్టింది. సాధారణంగా కొడుకులు లేని తల్లిదండ్రులకు కుమార్తెలు తలకొరివి పెట్టడం చూస్తుంటాం. అయితే అయినవాళ్లు ఎవరూ లేకపోవడంతో కుమారుడికి కన్నతల్లే తలకొరివి పెట్టిన సంఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పాలకొల్లులోని బంగారు వారి చెరువుగట్టుకు చెందిన వల్లూరి సత్యవాణి వృద్ధురాలు. ఆమె భర్త 18 ఏళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా ఇద్దరికీ వి వాహాలు అయ్యాయి. కుమార్తె బ్రెయిన్‌కి సంబంధిత వ్యాధితో పదేళ్ల క్రితం మృతిచెందింది. కుమారుడు శ్రీనివాస్‌కు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్న తల్లి సత్య వాణి వద్దే శ్రీనివాస్ ఉంటున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయినవాళ్లు ఎవరూ లేకపోవడతో తల్లి సత్యవాణి, పినతల్లి ఇద్దరూ కలిసి హిందూ శ్మశాన వాటికకు కై లాస రథంపై తీసుకువచ్చి కర్మకాండలు నిర్వహించారు. తల్లి సత్యవాణి తలకొరివి పెట్టగా.. బొండా చంద్రకుమార్ అనే వ్యక్తి ఆర్థికంగా వారికి సహకారం అందించారు. విషయం తెలిసిన కొందరు స్థానికులు శ్మశాన వాటిక వద్దకు వచ్చి సంతాపం తెలిపారు.


