విహారం.. కారాదు విషాదం
నరసాపురం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏకై క పేరుపాలెం బీచ్ నేటి నుంచి కళకళలాడనుంది. కార్తీకమాసం ప్రారంభమైన తరువాత మోంథా తుపాను కారణంగా వారంరోజుల నుంచి బీచ్‌కు పర్యాటకులను అనుమతించ లేదు. తుపాను ప్రభావం తగ్గడం, నేడు ఆదివారం కావడంతో బీచ్‌లో పర్యాటకుల సందడి పెరగనుంది. అయితే ప్రతి ఏటా బీచ్‌లో మరణాలు నమోదు కావడం, అధికారులు మాత్రం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
బీచ్‌లో మృత్యుఘంటికలు
ఏడాది పొడువునా బీచ్‌కు విహారం కోసం జనం వస్తుంటారు. వారాంతరాలు, సెలవు దినాల్లో బీచ్‌కు వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువ. ఇక కార్తీక మాసంలో అయితే లక్షల్లో వస్తుంటారు. పక్కజిల్లాలు నుంచి కూడా శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో హాజరవుతారు. కార్తీకమాసం నెలరోజుల్లో సుమారు 3 లక్షల మంది బీచ్‌ను సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన బీచ్‌లో మృత్యుఘంటికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 15 ఏళ్లలో బీచ్‌లో 150 మంది వరకూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. వీరంతా యువకులే కావడం గమనార్హం. సముద్రంలో గల్లంతైన వారికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కనీసం మృతదేహాలు కూడా దొరకవు. గత పదేళ్లలో ఇప్పటికీ 25 మంది వరకూ మృతదేహాలు సైతం లభ్యం కాలేదు.
పేరుపాలెం బీచ్ స్నానాలకు అనువుకాదా..?
పేరుపాలెం బీచ్ ప్రాంతంలో సముద్రంలో గుంటలు, గుంటలుగా ఉంటాయని మత్స్యకారులు చెబుతారు. దీంతో అలలు పెద్దపెద్దగా వచ్చినప్పుడు, కాళ్ల క్రింద ఇసుక విపరీతంగా కోతకు గురవుతుంది. దీనినే నిపుణులు అండర్ కరెంట్‌గా పేర్కొంటారు. ఇలా పెద్ద అలలు, కాళ్లక్రింద కోత జరిగినప్పుడు సముద్రంలో ఉన్నవారు శరీరంపై నియంత్రణను కోల్పోతారు. వెంటనే సముద్ర అలలకు కొట్టుకుపోతారు. సరిగ్గా ఇక్కడా ఇదే జరుగుతుందనేది వాదన. నిపుణులతో సమగ్ర సర్వే చేయించి, బీచ్‌లో సేఫ్‌జోన్ ప్రాంతాలను గుర్తించి, భద్రత కట్టుదిట్టం చేసే వరకూ పర్యాటకులను అనుమతించకూడదనే డిమాండ్ గతంలో వినిపించింది. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎక్కవకాలం అధికారంలో ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట పడేనా
పేరుపాలెం బీచ్ ఇటీవల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వంలో తీర గ్రామాలను బెల్ట్‌షాపులతో నింపేయడంతో బీచ్‌లో మద్యం ఏరులై పారడం, పేకాట సర్వసాధారణమైపోయాయి. కనీసం బీచ్ వద్దకు మద్యం సేవించి రాకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అలాగే ప్రమాదాలు జరుతున్న ప్రాంతాన్ని నిషేధిత జోన్‌గా ప్రకటించకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
నేటినుంచి పేరుపాలెం బీచ్‌లో సందడి
కార్తీక ఆదివారం కావడంతో పెరగనున్న పర్యాటకుల తాకిడి
తుపాను ప్రభావం తగ్గడంతో విహారానికి ఆసక్తి
ఏటా బీచ్‌లో మోగుతున్న మృత్యుఘంటికలతో ఆందోళన
భద్రతా చర్యలపై అధికారుల నిర్లక్ష్యం
విహారం.. కారాదు విషాదం


