భక్తులకు ఎన్నాళ్లీ ‘సెల్’ కష్టాలు.!
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవారిని దర్శించడం కంటే.. సెల్‌ఫోన్లను భద్రపరచడమే భక్తులకు కష్టంగా మారింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు సెల్‌ఫోన్‌లను డిపాజిట్ చేసేందుకు, దర్శనానంతరం వాటిని తిరిగి తీసుకునేందుకు భక్తులు కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్‌లలో నిలబడాల్సి వస్తోంది. దాంతో స్వామీ.. మాకేమిటీ కష్టాలని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే. శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఇదిలా ఉంటే భక్తులు ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేదం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, తూర్పు రాజగోపురం వద్ద భక్తులను తనిఖీ చేసిన తరువాతే సెక్యూరిటీ సిబ్బంది ఆలయంలోకి అనుమతిస్తారు. దాంతో భక్తులు తప్పనిసరిగా తమ సెల్‌ఫోన్లను ఆలయ తూర్పు ప్రాంతంలో ఉన్న డిపాజిట్ కౌంటర్‌లో భద్రపరచుకుంటున్నారు. భక్తుడి నుంచి ఒక్కో సెల్‌ఫోన్‌కు దేవస్థానం రూ. 5 రుసుమును వసూలు చేస్తోంది. అయితే నిర్వహణ లోపాలే భక్తుల ఇక్కట్లకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
తిరిగి తీసుకునేందుకూ అవస్థలే..
శ్రీవారి దర్శనం క్యూలైన్ కంటే.. సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద ఉండే క్యూలైనే పెద్దగా ఉంటోందని భక్తులు వాపోతున్నారు. ఇదంతా ఒకైతెతే స్వామివారి దర్శనానంతరం తిరిగి సెల్‌ఫోన్లు పొందేందుకు మళ్లీ భక్తులు క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోంది. దాంతో వారు విస్తుపోతున్నారు. సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద గంటల తరబడి సమయం వృథా అవుతోందని బాధిత భక్తులు మండిపడుతున్నారు.
కష్టాలు పడలేక..
కార్లలో వచ్చే భక్తులు సెంట్రల్ పార్కింగ్‌లో తమ వాహనాలను పార్క్ చేసుకుని, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్దకు వస్తున్నారు. అక్కడ క్యూ చూసి వెనక్కి వెళ్లిపోయి వారి ఫోన్లను కార్లలో పెట్టుకుంటున్నారు. బస్సులు, బైక్‌లు, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. కార్తీక మాసం శనివారం కావడంతో ఈ సమస్య స్పష్టంగా కనిపించింది. అధికారులు ఇందుకు పరిష్కార మార్గం ఎలా చూపిస్తారో?
సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద భారీ క్యూలు


