మోంథాతో ఆక్వాకు అపార నష్టం
తీవ్రంగా నష్టపోయాను
చెరువులన్నీ ఏకమయ్యాయి
అప్పు చేసి సాగు చేశాను
ప్రభుత్వం ఆదుకోవాలి
● గట్లు తెగి ఏకమైన చెరువులు
● తీవ్రంగా నష్టపోయిన రైతులు
నరసాపురం రూరల్ : మోంధా తుపాను నరసాపురం నియోజకవర్గంలోని ఆక్వారైతులకు తీవ్ర నస్టాన్ని మిగిల్చింది. తుపాను కారణంగా సముద్రం బిగబెట్టడంతో నరసాపుం తీరప్రాంతంలో ఉప్పుటేరు పొంగి నల్లీక్రీక్ బ్రిడ్జ్‌కి గండి పడటంతో రొయ్యల చెట్లు గట్లు అన్ని తెగిపోయాయి. దీంతో ఎకరం, రెండు ఎకరాలు సాగు చేసుకునే ఆక్వా రైతుల చెరువుగట్లు తెగిపోవడంతో ఆక్వా చెరువులన్నీ ఏకమయ్యాయి. లక్షలాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు పట్టుబడికి దగ్గరగా ఉన్న సమయంలో తుపాను రూపంలో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.
తీరప్రాంతంలో అంతా దిగాలు
తుపానును తట్టుకుని ప్రాణనష్టం నుంచి తప్పించుకోగలిగాం అని గుండెల మీద చేయి వేసుకున్న యంత్రాంగం.. తీరప్రాంత ప్రజానీకం చెరువులన్నీ ఏకం కావడంతో ఒక్కసారిగా దిగాలు చెందారు. అక్కడి దృశ్యాలను చూస్తూ ఆక్వా సాగుకు అపార నష్టం తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. అప్పోసప్పో చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇటీవల కాలంలో మోనో టైగర్ సాగును సముద్రతీర పారతంలో సాగు చేస్తున్నారు. ఈ సాగుకు ఆదినుంచీ ఖర్చుకూడా ఎక్కువగానే అవుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో మాత్రమే అందుకు కావల్సిన ఉప్పునీటి సాంద్రత ఉండటంతో ఇక్కడంతా ఈ సాగునే చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో 24 వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉండగా అధికారిక లెక్కల ప్రకారం 1,665 ఎకరాల్లో చెరువుల్లో ఆక్వా సాగు నష్టపోయినట్లు చెబుతున్నారు. రైతులు మాత్రం సుమారు రెండువేలకు పైబడి ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు పేర్కొంటున్నారు. బుధ, గురువారాల్లో తీరప్రాంత గ్రామాలో ఎక్కడ చూసినా నష్టపోయిన ఆక్వాట్యాంకులను ఒబ్బిడి చేసుకునే రైతులు, ఇంకా గట్లు తెగిపడే విధంగా ఉన్న చెరువుల్లోని పంటను కాపాడుకునే పనులు చేస్తున్న దృశ్యాలే కనిపించాయి. అతి తక్కువ కౌంట్‌తో సైతం ఐన కాడికి రొయ్యలను అమ్ముకునే ప్రయత్నం చేస్తూ కనిపించారు. నరసాపురం మండలంలోని బియ్యపుతిప్ప, వేములదీవి, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, చినమైనవానిలంక, గ్రామాలతోపాటు మొగల్తూరు మండలంలోని పేరుపాలెం, మొగల్తూరు, పాతపాడు తదితర ప్రాంతాల్లో ఆక్వా చెరువులన్నీ ఏకమై పోవడంతో ఆక్వా రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. నష్టపోయిన ఆక్వా రైతులను గుర్తించి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఆక్వా సాగు నష్టపోయిన రైతులు కోరుతున్నారు.
నేను చినమైనవానిలంకలో రెండు ఎకరాల్లో ఆక్వా సాగు చేశాను. కేవలం 45 రోజులు పెంచాను. అర్ధాతరంగా పట్టుబడి పట్టాల్సి రావడంతో రూ.3 లక్షల వరకూ నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– కొట్టు సత్యనారాయణ, ఆక్వా రైతు, తూర్పుతాళ్లు
ఈ సారి చెరువు బాగా వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాను. ఎన్నడూ చూడని విధంగా తుపాను ప్రభావంతో చెరువలన్నీ ఏకమై రొయ్యలన్నీ నీటిపాలయ్యాయి. కళ్లముందే పంటను కోల్పోవడం చాలా బాధగా ఉంది.
– మైల వెంకట సుబ్బారావు, ఆక్వారైతు, చినమైనవానిలంక
గతంలో పలు మార్లు వైరస్‌లు సోకడంతో నష్టపోయాను. డబ్బుల్లేకపోవడంతో అప్పు చేసి మరీ సాగు చేశాను. పంట చేతికొస్తుందనుకుంటున్న సమయంలో మోంధా తుపాను రూపంలో నష్టపోయాను.
– తిరుమాని నాగరాజు, వేములదీవి ఈస్ట్
రొయ్య పట్టుబడికి దగ్గర్లో ఉన్నామనుకుంటే తుపాను ముంచేసింది. వేటకు వెళ్లేవారికి, ఇతర పంటలు నష్టం వాటిల్లిన సమయాల్లో ఎలా పరిహారం ఇస్తారో అదే విధంగా ఆక్వా రైతులను కూడా ఆదుకోవాలి.
– తిరుమాని రామాంజనేయులు, వేములదీవి ఈస్ట్
మోంథాతో ఆక్వాకు అపార నష్టం
మోంథాతో ఆక్వాకు అపార నష్టం
మోంథాతో ఆక్వాకు అపార నష్టం
మోంథాతో ఆక్వాకు అపార నష్టం
మోంథాతో ఆక్వాకు అపార నష్టం
మోంథాతో ఆక్వాకు అపార నష్టం


