
కష్టాలు ఆవరించేను
సాక్షి, భీమవరం: జల వనరులశాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులను సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. కాలువలకు నీరు విడుదల చేసి నెల రోజులైనా పూర్తిస్థాయిలో శివారు ప్రాంతాలకు చేరక తొలకరి పను లు ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో 2.08 లక్షల ఎక రాల ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటివరకు 38 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. పలుచోట్ల నీరందక నారుమడులు ఎండిపోతున్నాయి.
శివారు.. అందని నీరు
జిల్లాలో 11 ప్రధాన పంట కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. తాడేపల్లిగూడెం, తణు కు, ఉండి, భీమవరం నియోజకవర్గాలతో పోలిస్తే ఆచంట, పాలకొల్లు, నరసాపురం కాలువలకు శివారులుగా ఉన్నాయి. గతంలో జూన్ మొదటి వారంలోనే కాలువలకు నీరు విడుదల చేస్తే నవంబర్ చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా జూలై మూడో వారం నాటికి నాట్లు పూర్తి చేసుకునేవారు. క్లోజర్ పనుల పేరిట ఈ ఏడాది జూన్ 15న నీటిని విడుదల చేశారు. అప్పటికీ క్లోజర్, ఓఅండ్‌ఎం పనులు పూర్తవ్వక పూర్తిస్థాయిలో కాలువలకు నీరందలేదు. జూన్ నెలాఖరు నాటికి నారుమడులు వేయడం పూర్తి కావాల్సి ఉండగా శివార్లలో జూలై రెండో వారం వరకు సాగాయి. పెనుమంట్ర, అత్తిలి, పాలకోడేరు తదితర మండలాల్లో కొన్నిచోట్ల జూన్‌లో కురిసిన వర్షాలపైనే నారుమడులు సిద్ధం చేసుకున్నారు.
ఎగువ ప్రాంతాల్లోనూ..
కాలువల ఎగువ ప్రాంతమైన తాడేపల్లిగూడెంలో ఇప్పటికే నాట్లు దాదాపు పూర్తికావాలి. ఈ నియోజకవర్గంలో 47,340 ఎకరాలకు 23,797 ఎకరాల్లో నాట్లు వేశారు. తణుకు నియోజకవర్గంలో 39,695 ఎకరాలకు 11,167 ఎకరాల్లోను, భీమవరంలో 19,740 ఎకరాలకు 200 ఎకరాలు, ఉండిలో 33,700 ఎకరాలకు 920 ఎకరాల్లో నాట్లు పడ్డాయి.
పొలాలు.. బీడులు
వరద నీటితో గోదావరి పొంగి ప్రవహిస్తుంటే చెంతనే ఉన్న పొలాలకు చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు బ్యాంకు కెనాల్, నరసాపురం చానల్ ద్వారా సాగునీటి సరఫరా అవుతుంది. కాకరపర్రు రెగ్యులేటర్ గేట్ల వద్ద తూడు తొలగింపు, ఓఅండ్‌ఎం పనులు సకాలంలో పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర నీటి ఎద్దడి ఎదురైంది. సాగునీరందక పోడూరు, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో నారుమడులు ఎండిపోయి పొలాలు బీటలు తీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంత్రి ఇలాకా.. సాగు సాగక..
జల వనరులశాఖ మంత్రి జిల్లాలో సాగునీటి ఇక్కట్లు
జూన్ 15న కాలువలకు నీరు విడుదల
నెల రోజులు దాటినా శివారు ప్రాంతాలకు చేరని సాగునీరు
జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు
ఇప్పటివరకు 38 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు
ఆచంట, పాలకొల్లు, నరసాపురంలో నత్తనడకన తొలకరి పనులు
మంత్రి ఇలాకాలో నత్తనడకన..
వేలాది రూపాయలు వెచ్చించి వేసిన నారుమడులు సాగునీరందక ఎండిపోతున్నాయని పలుచోట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులో దాదాపు 23 వేల ఎకరాలకు ఇప్పటివరకు కేవలం 290 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేయగా పలుచోట్ల నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆచంటలో 38 వేల ఎకరాలకు 1,480 ఎకరాల్లో నాట్లు పడగా, నరసాపురంలో 7,615 ఎకరాలకు గాను ఇంకా నాట్లు పడకపోవడం గమనార్హం. శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల ఇప్పటికీ సాగు పనులు మొదలవ్వక భూముల్లో గడ్డి పెరిగిపోయి ఉన్నాయి. పూర్తిస్థాయిలో కాలువలకు నీరంది, దమ్ములు చేసి, నాట్లు వేసేందుకు మరో నెలరోజులు సమయం పడుతుందని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. సాగు జాప్యంతో నవంబర్‌లో తుపాన్లతో పంటకు నష్టం కలిగించే అవకాశంతో పాటు దాళ్వా జాప్యమవుతుందంటున్నారు. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కష్టాలు ఆవరించేను