
రూ.22.43 లక్షల ఎరువుల అమ్మకాలు నిలుపుదల
తాడేపల్లిగూడెం రూరల్: రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బుధవారం తాడేపల్లిగూడెంలోని ఎరువులు, పురుగు మందుల గోదాములను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా కోరమండల్ స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేశారు. అలాగే, ఎఫ్‌ఎంసీ గోదామును పరిశీలించి సూక్ష్మ పోషక ఎరువులు బయోస్టిమ్యూలెంట్స్‌ను గుర్తించి, రూ.22,43,950 విలువైన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. కంపెనీ స్టాక్ పాయింట్‌లను పరిశీలించి నిల్వలను తనిఖీ చేశారు. ఈ బృందంలో జిల్లా వనరుల కేంద్రం (పెద్దాపురం) సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్.బుల్లిబాబు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణ, తాడేపల్లిగూడెం ఏడీఏ గంగాధరరావు, ఏవో నారాయణరావు, వ్యవసాయాధికారి (టెక్నికల్) కృష్ణకాంత్ ఉన్నారు.
పెంటపాడులో...
పెంటపాడు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి చీర్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఐఓపీ గోపాలకృష్ణ, ఏడీఏ బుల్లిబాబు, గూడెం ఏడీఏ గంగాధర్‌ల ఆధ్వర్యంలో పలు కంపెనీలకు చెందిన అక్రమంగా నిల్వ ఉన్న ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తనిఖీల్లో రికార్డులు సరిగా లేని రూ.1,07,000 విలువైన ఎరువులను గుర్తించి వాటి విక్రయాలను నిలుపుదల చేసినట్లు చెప్పారు.