
భర్త బెదిరిస్తున్నాడని ఫిర్యాదు
జంగారెడ్డిగూడెం: తనపై పెట్టిన మనోవర్తి కేసు వెనక్కి తీసుకోవాలని భర్త బెదిరిస్తున్నట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన నన్నుబ్రోలు నాగదుర్గాప్రసాద్, సత్యతులసిలకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. సత్యతులసి భర్తపై మనోవర్తి కేసు పెట్టిందన్నారు. ఈ నెల 13న సత్యతులసి తన పిల్లలతో ఉన్న సమయంలో నాగుదుర్గాప్రసాద్ మద్యం సేవించి ఇంటికి వచ్చి బూతులు తిడుతూ, కొడుతూ కేసు వెనక్కి తీసుకోవాలని దౌర్జన్యం చేశాడన్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే చంపుతానని బెదిరించాడని, దీంతో సోమవారం ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విజిలెన్స్ తనిఖీలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలంలో విజిలెన్స్, వ్యవసాయ అధికారులు ఎరువులు, పురుగుమందులు, విత్తనాల షాపులను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ జి.మధుబాబు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మండలంలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా చాముండేశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌లో నిర్వహించిన తనిఖీల్లో వ్యత్యాసాలు గుర్తించామన్నారు. గడువు ముగిసిన పురుగుమందులు గుర్తించినట్లు చెప్పారు. సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించకపోవడంతో సేల్స్ నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. తనిఖీల్లో సీఐ మధుబాబుతో పాటు సహాయ వ్యవసాయ సంచాలకుడు బి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.