
బడుగులకు మొండిచేయి
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, భీమవరం: వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ల రిజర్వేషన్లలో ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. జిల్లాలో పది ఏఎంసీలు ఉండగా వీరికి ఎక్కడా స్థానం కల్పించలేదు. ఐదు జనరల్‌కు, మూడు బీసీ, రెండు ఎస్సీలకు కేటాయించారు. తొలుత భీమవరం ఏఎంసీ ఎస్టీ మహిళ, నరసాపురం బీసీ మైనార్టీకి కేటాయించగా కూటమి నేతల ఒత్తిళ్ల మేరకు మార్పులతో రివైజ్డ్ జాబితాను విడుదల చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో పది ఏఎంసీలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వీటి నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.65.98 కోట్ల ఆదాయం సమకూరుతోంది. రూ.15.6 కోట్ల ఆదాయ ఆర్జనతో భీమవరం మొదటిస్థానంలో ఉండగా రూ.12.45 కోట్లతో ఉండి రెండో స్థానంలో ఉంది. అత్తిలి రూ.2.75 కోట్లు, ఆచంట రూ.1.91 కోట్లతో చివరి స్థానాల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత స్థానం ఏఎంసీ చైర్మన్‌దే. ఈ పదవి కోసం ఎంతోమంది ఆశావహులు ఉంటారు.
ఒత్తిడి మేరకు రిజర్వేషన్లలో మార్పు
జీఓ నెంబర్ 77 ప్రకారం మొత్తం స్థానాల్లో 50 శాతం జనరల్‌కు రిజర్వు చేయగా, మిగిలిన 50 శాతంలో బీసీ, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం సర్దుబాటు చేయాలి. ఈ నెల 8న జిల్లాలోని ఏఎంసీ చైర్మన్ల పదవికి జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లు ఖరారు చేసింది. జిల్లా యూనిట్‌గా జనాభా ప్రాతిపదికన వీటిని రూపొందించినట్టు సమాచారం. రెండు ఏఎంసీలకు ఓసీ జనరల్, రెండు చోట్ల ఓసీ మహిళ, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్సీ జనరల్, భీమవరం ఎస్టీ మహిళ, నరసాపురం బీసీ మైనార్టీకి కేటాయించారు. ఈ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
భీమవరం, నరసాపురంలలో ఏఎంసీ చైర్మన్ పదవులకు టీడీపీ, జనసేనలోని అగ్రవర్ణాల నుంచి తీవ్ర పోటీ ఉంది. చైర్మన్ల విషయంలో ఇప్పటికే రెండు చోట్ల కూటమి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆచంట ఏఎంసీకి సంబంధించి గతంలోనే బీసీల నుంచి టీడీపీ నాయకత్వం అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. రిజర్వేషన్లు బెడిసికొట్టడంతో ఆశావాహుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఆయా నియోజకవర్గాల కూటమి నేతలు తమకు అనుకూలంగా రిజర్వేషన్ల మార్పు కోసం ఉన్నతస్థాయి నుంచి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని నేతలకు అనుకూలంగా అదే రోజు రివైజ్డ్ జాబితాను విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ల మేరకు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లతో తణుకు ఏఎంసీ చైర్మన్‌గా కొండేటి శివ, అత్తిలికి దాసం ప్రసాద్, తాడేపల్లిగూడెంకు చాపల మంగాబాయి, పాలకొల్లుకు కోడి విజయభాస్కర్, ఆకివీడుకు బొల్ల వెంకట్రావు చైర్మన్లుగా ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
గతంలో పారదర్శకంగా..
పాలనలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన జగన్ సర్కారు రిజర్వేషన్ల అమలులో వారికి సముచిత స్థానం కల్పించి అందరికి సమన్యాయం చేశారు. నిబంధనలు మేరకు ఐదు జనరల్‌కు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు, బీసీలకు కేటాయించిన రెండింటిలో ఒకటి మైనార్టీకి రిజర్వు చేశారు.
న్యూస్‌రీల్
చిన్నచూపు తగదు
ముందుగా వచ్చిన జాబితాలో భీమవరం ఏఎంసీ ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. తర్వాత రివైజ్ చేసి ఓసీ మహిళకు మార్పుచేశారు. ఎస్టీలకు జిల్లాలో ఎక్కడా కేటాయింపు చేయకపోవడం తగదు. గత ప్రభుత్వంలో నిబంధనలు మేరకు ఎస్టీలకు చైర్మన్ పదవి ఇచ్చారు.
– సాలా శ్రీనివాస్, ఎరుకల సంఘం
భీమవరం రూరల్ అధ్యక్షుడు
మైనార్టీలపై చిన్నచూపు
మైనార్టీలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. నరసాపురం ఏఎంసీ చైర్మన్ పదవిని ముందుగా మైనార్టీలకు కేటాయించి, ఒక్కరోజులో మళ్లీ రిజర్వేషన్ మార్చడం దారుణం. ఈ ఏఎంసీ పదవిని ఇంతవరకూ ముస్లిం మైనార్టీలు చేపట్టలేదు. మొదటిసారి ఓ ముస్లిం ఆ పదవిలో చూద్దామని ఆశపడ్డ మాకు ఒక్కరోజులోనే అసంతృప్తి మిగిల్చారు.
– ఎండీ బాషా ఖాన్, నరసాపురం
ఏఎంసీ చైర్మన్ల రిజర్వేషన్లలో ఎస్టీ, మైనార్టీలకు దక్కని చోటు
కావాల్సిన వారికి కట్టబెట్టుకునేందుకు కూటమి నేతల ఒత్తిళ్లు
ఆ మేరకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ల సవరణ
గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటిస్తూ రిజర్వేషన్ల అమలు
ఏఎంసీ 2023లోని రిజర్వేషన్లు రెండ్రోజుల క్రితం రివైజ్ చేసిన తర్వాత
ఆకివీడు బీసీ (మైనార్టీ మహిళ) బీసీ (మహిళ) బీసీ
అత్తిలి ఓసీ ఓసీ (మహిళ) ఓసీ
భీమవరం ఓసీ ఎస్టీ (మహిళ) ఓసీ (మహిళ)
పాలకొల్లు ఎస్టీ (మహిళ) బీసీ బీసీ
పెనుగొండ ఓసీ (మహిళ) ఓసీ ఓసీ
తాడేపల్లిగూడెం ఎస్సీ ఓసీ (మహిళ) ఎస్సీ (మహిళ)
తణుకు ఎస్సీ (మహిళ) ఎస్సీ ఎస్సీ
ఉండి ఓసీ ఓసీ ఓసీ
ఆచంట ఓసీ ఎస్సీ (మహిళ) బీసీ (మహిళ)
నరసాపురం బీసీ బీసీ (మైనార్టీ) ఓసీ

బడుగులకు మొండిచేయి

బడుగులకు మొండిచేయి

బడుగులకు మొండిచేయి