ముంచెత్తుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

ముంచెత్తుతున్న వరద

Jul 12 2025 11:17 AM | Updated on Jul 12 2025 11:17 AM

ముంచె

ముంచెత్తుతున్న వరద

సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద సీజన్‌ వచ్చేసింది. శుక్రవారం ఒకేరోజు 6.35 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి పోటెత్తింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. ఎద్దులవాగు వంతెన పైకి నీరు చేరి శుక్రవారం అర్ధరాత్రికి నీటమునిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరో మూడు రోజులు పాటు వరద ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ఉపనది శబరి వరద నీటితో పోటెత్తుతోంది. గత వారం రోజులుగా రోజూ సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం మీదుగా సముద్రంలో వరద నీరు కలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మాత్తుగా వరద తీవ్రత రెట్టించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరికి వరదలు పోటెత్తడంతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాలున్న యలమంచిలి, ఆచంట మండలాల్లో వరద తీవ్రత ఉంటుంది. ప్రధానంగా ముంపు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయి.. వందలాది ఇళ్ళు జలదిగ్భందంలో చిక్కుకుంటాయి. ఈ పరిణామాల మధ్య ఈ ఏడాది కూడా గోదావరి వరద తీవ్రత శుక్రవారం ఆకస్మాత్తుగా పెరగడంతో ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్‌ ప్రకటించారుఉ. రాత్రి 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద 37.60 అడుగులకు నీటిమట్టం చేరింది. 6,98,510 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయానికి పోలవరం నుంచి దిగువకు 6,35,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద తీవ్రత శనివారం మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, 7.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉందని అధికారుల అంచనా. మహారాష్ట్ర, తెలంగాణాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వరద తీవ్రత మొదలైంది.

జలదిగ్బంధంలో ఎద్దులవాగు వంతెన

వేలేరుపాడు–కొయిదా మార్గంలోని ఎద్దులవాగు వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రికి పూర్తిగా నీటమునిగింది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండల కేంద్రానికి జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు– దాచారం రహదారిలో గుండేటివాగు ఉధృతంగా ప్రవహించి వంతెన నీటమునిగింది. దీంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే కుక్కునూరు మండలంలో దాచారం, గొమ్ముగూడెం పంచాయితీ నలువైపులా నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గొమ్ముగూడేనికి చెందిన 15 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించారు.

ముంపు ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో పర్యటన

వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం రూరల్‌: కలెక్టర్‌ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఐటీడీఏ పీవో రాములనాయక్‌ పర్యటించారు. కుక్కునూరు మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన లచ్చిగూడెం, గొమ్ముగూడెంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దాచారం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిరావాలని గ్రామస్తులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 30.110 మీటర్లకు చేరింది. స్పిల్‌ వే 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

పోలవరం నుంచి 6.35 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

ఏజెన్సీలో నీటమునిగిన ఎద్దులవాగు వంతెన

18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

మరో మూడు రోజులు ఉధృతి కొనసాగే అవకాశం

ఏజెన్సీలో అప్రమత్తం

ముంచెత్తుతున్న వరద 1
1/2

ముంచెత్తుతున్న వరద

ముంచెత్తుతున్న వరద 2
2/2

ముంచెత్తుతున్న వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement