
కఠినంగా శిక్షించాలి
పాలకొల్లు సెంట్రల్: రంగరాయ కాలేజీలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలు విద్యా సంస్థకు వెళ్లాలన్నా, రోడ్డుపై తిరగాలన్నా, ఆస్పత్రికి వెళ్లినా అక్కడ కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జోగాడ ఉమామహేశ్వరరావు, వీరా మల్లిఖార్జునుడు, దేవ రాజేష్, మామిడిశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత
భీమవరం: భీమవరం పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల వద్ద ర్యాగింగ్ అంటూ కలకలం రేగింది. బైపాస్ రోడ్డులోని ఈ జూనియర్ కళాశాలలో ఈ నెల 5న జూనియర్, సీనియర్ విద్యార్థుల వద్ద టాయిలెట్ల వద్ద వివాదం ఏర్పడింది. వివాదానికి కారణమైన ఏడుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలిసింది. బాధిత విద్యార్థుల్లో ఒక విద్యార్ధి తండ్రి శుక్రవారం కళాశాలకు చేరుకుని వివాదం వివరాలు తమకెందుకు చెప్పలేదంటూ కళాశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. దీనిపై ఇంటర్మీడియట్ జిల్లా అధికారి జి.ప్రభాకరరావును వివరణ కోరంగా వివాదం తన దృష్టికి రాలేదని, వివరాలు తీసుకుంటానన్నారు.
హమాలీల కూలి రేట్లు పెంచాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరంలో మర్చంట్ అండ్ చాంబర్ పరిధిలో హమాలీ కార్మికులకు కూలీ రేట్ల పెంపుదలలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలు నుంచి విజ్ఞాపన యాత్రను శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్దకు పదర్శన చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా ఉండాలన్నారు. ఐఎఫ్‌టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల కాల పరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని, అది సరి కాదన్నారు.
రైళ్లలో ప్రత్యేక తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోకి గంజాయి, మత్తుపదార్థాలు రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరులో పోలీస్, రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి రైలులో తనిఖీలు చేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

కఠినంగా శిక్షించాలి