
ఆధ్యాత్మిక చింతనలో అతివలు
ద్వారకాతిరుమల: మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన. ఆ దిశగా అడుగులు వేస్తూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేవుని సేవలో తరిస్తున్నారు వందలాది మంది మహిళలు. బృందాలుగా ఏర్పడి, దేవాలయాల్లో భగవద్గీత పారాయణలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం చేశారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 500 మంది మహిళలు పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కామవరపుకోట మండలం జలపవారిగూడెంకు చెందిన కామిశెట్టి రాంబాబు, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో సామాన్య భక్తులు సైతం భాగస్వాములయ్యారు.
దూరాన్ని లెక్కచేయకుండా..
ఏలూరు జిల్లాకు చెందిన మహిళలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, వైర, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, పాల్వంచ, అలాగే విశాఖపట్నం, నూజివీడు, తిరువూరు, విసన్నపేట, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహిళా భక్తులకు శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు స్వామి వారి ఉచిత దర్శనంతో పాటు, అన్నప్రసాదాన్ని అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సూపరింటెండెంట్‌లు కోటగిరి కిషోర్, గోవాడ సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు.
శ్రీవారి క్షేత్రంలో భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం
రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేస్తున్న మహిళలు
500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు
సంతృప్తినిచ్చింది
ఆన్‌లైన్‌లో భగవద్గీత పారాయణం నేర్చుకున్నాను. తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో, అది కూడా తొలి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, గానామృతం చేయడం సంతృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం అధికారులు పూర్తి సహకారాన్ని అందించారు.
– కామిశెట్టి ఉషారాణి, కామవరపుకోట మండలం జలపవారిగూడెం
ప్రశాంతత లభిస్తుంది
ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే హైదరాబాద్ నుంచి వచ్చాను. తొలి పండుగ నాడు అధిక సమయం శ్రీవారి సన్నిధిలో గడపడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
– కొమ్మూరి గాయత్రి, హైదరాబాద్.
ఏడు వందల శ్లోకాలు కంఠస్థం
భగవద్గీత పారాయణను ఆన్‌లైన్ ద్వారా నేర్చుకున్నాను. గోల్డ్‌మెడల్ కూడా వచ్చింది. శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసిన సుమారు 200 మంది గోల్డ్‌మెడలిస్టులం పాల్గొన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా పారాయణం, గానామృతం చేశాం.
– సెనగపల్లి పూర్ణిమ, విజయవాడ

ఆధ్యాత్మిక చింతనలో అతివలు

ఆధ్యాత్మిక చింతనలో అతివలు

ఆధ్యాత్మిక చింతనలో అతివలు