
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వ్యాపారాలతో అభివృద్ధి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఆర్టీసీ కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఔత్సాహిక వ్యాపారులతో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని కలిదిండి, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన వివరాలు, లీజుకు ఉండే నియమ నిబంధనలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజ్ బీ. వాణి, డీఈ బీవీ రావు, ఏఈ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు
భీమవరం: తన భార్య బెల్లం రమ్య, తన పిల్లలు కన్పించడం లేదంటూ భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన బొల్లం సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామరావు చెప్పారు. వివరాల ప్రకారం ఈ నెల 5న సుబ్బారావు పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కన్పించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు.
14న మెగా జాబ్ మేళా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్. జితేంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు బుధవార ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 30కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 2,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 81435 49464, 89785 24022, 94934 82414 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.