
అల్లూరి సాంస్కృతిక కేంద్రం కోసం దీక్షలు
భీమవరం : పట్టణంలోని పాత బస్‌స్టాండ్ వద్ద తొలగించిన అల్లూరి సీతారామరాజు భవనం స్థానంలో అందరికీ ఉపయోగ పడే సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని అల్లూరి మెమోరియల్ హాలు సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాశంచౌక్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా అల్లూరి జయంతి సందర్భంగా సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు కనుమూరి సత్యనారాయణరాజు, సీపీఎం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారామ్ అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ గతంలో మెమోరియల్ హాలును విరాళాలు సేకరించి నిర్మించామన్నారు. హాలు శిథిలం కావడంతో దాన్ని తొలగించి తిరిగి నిర్మిస్తామని చెప్పి సంవత్సరాలు గడిచిపోయినా నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. రిలే నిరాహార దీక్షలలో సాధన కమిటీ సభ్యులు బి.బలరామ్, జేఎన్‌వీ గోపాలన్, బి.వాసుదేవరావు, డి.కళ్యాణి కూర్చున్నారు. సాధన కమిటీ నాయకులు కంతేటి వెంకటరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ పాల్గొన్నారు.