
కండిగలమ్మ ఆలయంలో భారీ చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలో ఉన్న కండిగలమ్మ, పోతురాజు స్వామి వార్ల ఆలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో అమ్మవారి మూలవిరాట్ మీద ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు, హుండీలోని నగదు చోరీకి గురైంది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రాత్రి 1 గంట సమయంలో ఆలయం గేట్లకు ఉన్న తాళాలను, ద్వారాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌పై ఉన్న రెండున్నర కేజీల వెండి కిరీటం, ఒక వెండి కనురెప్ప, ఒక కాసు బంగారపు కళ్లు, అరకాసు బంగారు మంగళ సూత్రం, ముప్పావు కాసు బంగారు ముక్కుపుడక, బీరువా లోని విలువైన పట్టు చీరలను చోరీ చేశారు. అలాగే హుండీని పగలగొట్టి అందులోని సుమారు లక్ష రూపాయలను చోరీ చేశారు. ఆ తరువాత ఖాళీ హుండీని, అమ్మవారి మెడలోని గిల్టు మంగళ సూత్రాలను, చోరీకి ఉపయోగించిన సమిట, పలుగును ఆలయం పక్కనున్న కోకో తోటలో పడేశారు. రోజూలానే శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వెళ్లిన ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ధర్మారావు చోరీ జరిగినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై టి.సుధీర్ ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను, తోటలో దుండగులు పడవేసిన హుండీని, చోరీకి ఉపయోగించిన ఆయుధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ జాగిలంతో తనిఖీలు జరిపారు. అలాగే క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. ధర్మారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధీర్ తెలిపారు.

కండిగలమ్మ ఆలయంలో భారీ చోరీ