
కారు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు పట్టణానికి చెందిన బొండాడ వీఎల్ నరసింహరావు గుప్త (51) మృతి చెందారు. గురువారం గుప్త మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం బొండాడ గుప్త పట్టణంలో ఎర్రవంతెన వద్ద దూది పరుపులు వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య దేవి ఇంటి వద్ద ఎంబ్రాయిడింగ్ డిజైన్ మెషీన్ వర్క్ చేస్తుంటారు. మెషీన్ మరమ్మతు రావడంతో రాజమండ్రిలో మరమ్మతు చేయించాలని భార్యాభర్తలిద్దరూ గురువారం వారికి తెలిసిన మిత్రుడి కారు తీసుకుని రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యలో కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలోని ఈతకోట వద్ద కారు ముందు టైరు పంక్చర్ అవ్వడంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గుప్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య దేవి, ఎదురుగా వస్తున్న కారులో వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.