
సేవల్లో పీహెచ్‌సీలు భేష్
భీమవరం(ప్రకాశం చౌక్): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చేసిన కృషి ఫలితంగా నేడు పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాయి. జిల్లాలో 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో గుర్తింపు పొందాయి. నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల స్థాయి పెంచడం, వైద్యుల సంఖ్య పెంచడం, అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి సకాలంలో ప్రజలకు వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు.
బాబు పాలనంలో అధ్వానంగా..
గత చంద్రబాబు పాలనలో ప్రజల ఆరోగ్యం గాలికొదిలేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది, మందులు, భవనాల కొరత ఉండేది. గత పాలనలో జిల్లాలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భవనం కూడా నిర్మించలేకపోయారు. వైద్య సేవలు అరకొరగా అందేవి. వైద్య పరీక్షలు ఉండేవి కావు. వైద్యులు అందుబాటులో ఉండేవారు కాదు.
జగన్ పాలనలో..
జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేపట్టిన తర్వాత కరోనా విపత్తు వల్ల రెండేళ్లు పాలనకు ఇబ్బంది వచ్చినా మిగిలిన మూడేళ్లుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి పనిచేశారు. శాశ్వత భవనాలను యుద్ధప్రాతిపదికన నిర్మించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జిల్లాలో రూ.16.14 కోట్లతో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించారు. అందులో రూ.7.20 కోట్లతో 9 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలు నిర్మించారు. రూ.8.94 కోట్లతో 6 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలు నిర్మించారు. రూ.1.20 కోట్లతో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు పెంచారు.
పూర్తిస్థాయి వైద్య సేవలు, సిబ్బంది
జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వైద్యులను నియమించారు. పూర్తిస్థాయిలో సిబ్బంది, 14 రకాల పరీక్షలు, 100 రకాల మందులు, పాము, కుక్క కాటుకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచారు. గుండెపోటుకు సంబంధించి రూ.45 వేల విలువైన ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచి అనేక మంది ప్రాణాలు నిలిపారు. డెలివరీ సంఖ్య పెరిగింది.
కూటమి ఘనత అన్నట్లు ప్రచారం
జగన్ పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి నాయకులు మాత్రం తమ ప్రభుత్వంలో ఆరోగ్య కేంద్రాలు అద్బుతంగా పనిచేస్తున్నాయని ఇది వారి ప్రభుత్వం గొప్పతనం అంటున్నారు. ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చేసింది ఏమి లేదు.
జగన్ ప్రభుత్వంలో నిర్మించిన నూతన భవనాలు
భీమవరం 3, తాడేపల్లిగూడెం 1, నరసాపురం 1, పాలకొల్లు 1, తణుకు 1 ఆకివీడు 1, లంకలకోడేరు 1, ముదునూరు 1, మంచిలి 1, మేడపాడు 1, ఆచంట వేమవరం 1, కాళ్ల 1.
జగన్ హయాంలో అభివృద్ధి వల్ల తాజా ర్యాంకు
నాటి చంద్రబాబు పాలనలో పీహెచ్‌సీలు నిర్వీర్యం

సేవల్లో పీహెచ్‌సీలు భేష్