ధాన్యం సొమ్ముల కోసం నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సొమ్ముల కోసం నిరీక్షణ

Published Sat, Jun 15 2024 12:30 AM | Last Updated on Sat, Jun 15 2024 12:36 AM

ధాన్యం సొమ్ముల కోసం నిరీక్షణ

చెల్లింపుల్లో జాప్యం

సాక్షి, భీమవరం: 2023 సీజన్‌కు గాను పశ్చిమగోదావరి జిల్లాలో రబీ ధాన్యం సేకరణ పూర్తయ్యింది. ధర బాగుండటంతో అధిక శాతం మంది రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌లో విక్రయించుకునేందుకే మొగ్గుచూపారు. రూ.1,399 కోట్ల విలువైన 6.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా.. ఇంతవరకు రైతుల ఖాతాలకు రూ.461 కోట్లు జమయ్యాయి. మిగిలిన సొమ్ముల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

2.10 లక్షల ఎకరాల్లో..

జిల్లాలోని 2.10 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేశారు. అధిక శాతం విస్తీర్ణంలో 1121 రకం వైరెటీ సాగు చేశారు. ఖరీఫ్‌ చివరిలో మిచాంగ్‌ తుపాను ప్రభావంతో రబీ ఆలస్యమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. తెగుళ్ల బెడద తక్కువగా ఉండటంతో రైతుల పంట పండి ఎకరాకు 50 నుంచి 55 బస్తాల వరకు దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి.

6.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లా వ్యాప్తంగా 9.25 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా కాగా స్థానిక అవసరాలు పోను 7.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో తలమునకలై ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగకుండా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పర్యవేక్షణలో జేసీ ప్రవీణ్‌ ఆదిత్య ధాన్యం సేకరణకు చర్యలు తీసుకున్నారు. ఎక్కడా లోపాలు తలెత్తకుండా కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు మొబైల్‌ టీంలు ఏర్పాటు చేయడంతో పాటు 211 పెద్ద, చిన్న రైసు మిల్లులను గుర్తించి, వాటికి కస్టోడియన్‌ అధికారుల నియామకం చేశారు. 1.8 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచారు. ఈ–క్రాప్‌లో నమోదైన వివరాల మేరకు ఆర్‌బీకే సిబ్బంది నేరుగా పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేశారు. మద్దతుకు మించి ధర రావడంతో బయట మార్కెట్‌లో ధాన్యం విక్రయాలకు రైతులు మొగ్గుచూపారు. ఈ క్రమంలో జిల్లాలోని 324 ఆర్‌బీకేల ద్వారా 71,735 మంది రైతుల నుంచి రూ.1,399 కోట్ల విలువైన 6.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

ఎదురుచూపులు : ఖరీఫ్‌ మొదలైన నేపథ్యంలో సాగు పెట్టుబడుల నిమిత్తం ధాన్యం సొమ్ముల కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో బకాయిల విడుదలకు పాలకులు, అధికార యంత్రాంగం చొరవ చూపాలని కోరుతున్నారు. ధాన్యం బకాయిలపై ఉన్నతాధికారులకు నివేదించామని, త్వరలోనే నిధులు విడుదలవుతాయని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు అంటున్నారు.

‘పశ్చిమ’లో పూర్తయిన రబీ ధాన్యం కొనుగోళ్లు

ఆర్‌బీకేల ద్వారా 6.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,399 కోట్లు

ఇంతవరకు చెల్లించింది రూ.461 కోట్లు

నిర్ణీత గడువు 21 రోజులు

బకాయిలు రూ.938 కోట్ల సొమ్ముల కోసం రైతుల ఎదురుచూపులు

దళారులు, కమిషన్‌ వ్యాపారుల దోపిడీకి ఎక్కడ ఆస్కారం లేకుండా రైతులకు అండగా గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తూ వచ్చింది. ధాన్యం విక్రయించిన 21 రోజుల లోపే వారి ఖాతాలకు సొమ్ములు జమచేయాలి. ఆన్‌లైన్‌ చేయడంలో జాప్యం, సాంకేతిక అవరోధాలతో సొమ్ముల చెల్లింపుల్లో జాప్యంతో ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈ క్రాప్‌ డేటా ఆధారంగా ఆధార్‌ ఎనేబిల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకువచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. ఫలితంగా నిర్ణీత గడువుకన్నా ముందే గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన రెండు మూడు రోజుల్లోనే చెల్లింపులు జరిగాయి. రబీలోను సత్వర చెల్లింపులు చేస్తూ వచ్చారు. ముందుగా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలోనే వారి ఖాతాలకు సొమ్ములు జమయ్యాయి. ఇంతవరకు రూ.461 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఎన్నికలు రావడంతో కొద్దిరోజులుగా ధాన్మం సొమ్ములు జమచేయడం నెమ్మదించింది. ఇంకా రూ.938 కోట్లు రైతులకు అందాలి. సొమ్ములు రావాల్సిన వారిలో అధికశాతం మూడు వారాల గడువు ముగిసిన వారే ఉన్నట్టు రైతులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement