తణుకు: ఆంధ్రా యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో తణుకు పట్టణానికి చెందిన దివ్యాంగుడు కొప్పాక రమేష్‌బాబు చేసిన పరిశోధనకు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాల ఆధారంగా ఉభయగోదావరి జిల్లాల్లోని పెట్టుబడిదారుల అవగాహనపై రమేష్‌బాబు ఆచార్య జాలాది రవి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. తణుకు పాతవూరుకు చెందిన రమేష్‌బాబు డిగ్రీ వరకు తణుకులోనే విద్యాభ్యాసం కొనసాగించి అనంతరం పీజీ, పీహెచ్‌డీ విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీవీ ప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా పీహెచ్‌డీ ప్రొసీడింగ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రమేష్‌బాబును పలువురు అభినందించారు.
విద్యుదాఘాతానికి కూలీ మృతి
టి.నరసాపురం: ఆయిల్ పామ్ తోటలో గెలలు కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. టి.నరసాపురానికి చెందిన దొంత నాగేశ్వరరావు (40) ఆయిల్‌పామ్ తోటలో గెలలు కోసే పనులకు వెళుతుంటాడు. టి.నరసాపురంలో ఓ రైతుకు చెందిన ఆయిల్‌పామ్‌తోటలో ఇనుపగెడతో సోమవారం గెలలు కోస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తు చెట్టుకు సమీపంలో ఉన్న విద్యుత్ వైరుకు గెడ తగలడంతో షాక్‌కు గురై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నాగేశ్వరరావుకు వివాహం కాగా, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య దొంతా రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.సతీష్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రైలు నుంచి జారిపడి పంజాబ్ వాసి మృతి
దెందులూరు/ఏలూరు టౌన్: రైలులో ప్రయాణిస్తూ జారి పడటంతో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఏలూరు రైల్వే ఎస్సై డి.నర్సింహరావు చెప్పారు. మృతుడి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఈ వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందిన లాల్టూ విశ్వాస్ (32)గా గుర్తించామన్నారు. గుర్తు తెలియని రైలులో ప్రయాణిస్తూ దెందులూరు వద్ద జారిపడటంతో మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని ఏలూరు మర్చూరీలో భద్రపరిచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆవు మృతిపై సుమోటోగా కేసు
ఆకివీడు: స్థానిక గుమ్ములూరు సెంటర్లో ఈ నెల 21న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందిన ఘటనపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై భీమవరం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ మేరకు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందగా, ఆవు మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించి, సంబంధిత వ్యక్తులపై, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆకివీడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఐపీసీ 429, సెక్షన్ 11 జంతు హింస చట్టం, సెక్షన్ 27 గోసంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీలను సేకరించి ఈ నెల 31 లోగా నివేదిక కోర్టుకు సమర్పించాలని ఆకివీడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.