ముందస్తు పంట ప్రణాళికలు రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు పంట ప్రణాళికలు రూపొందించాలి

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ముందస్తు పంట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల క్షేత్రస్థాయి అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వరి సాగుకు బదులుగా వాతావరణ పరిస్థితులు, నీటి ల భ్యత, నేల స్వభావానికి అనుగుణంగా తక్కువ నీటితో పండించే పంటలను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. పంట అవశేషాలకు నిప్పు పెట్టే వారిని గుర్తించి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల, జిల్లా ఉ ద్యానవనశాఖ అధికారి ఆర్‌.శ్రీనివాస్‌రావు, వ్యవసాయ సంచాలకులు బి.శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన

ఖిలా వరంగల్‌: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ గోదాములో భద్రపరచిన ఈవీఎంలను కలెక్టర్‌ సత్యశారద వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎన్నికల విభాగ డీటీ రంజిత్‌, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మార్కెట్‌ యార్డు సందర్శన

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డును మంగళవారం కలెక్టర్‌ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా పోటెత్తిన మిర్చి యార్డును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక, కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖ, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి, వైస్‌ చైర్మన్‌ జనార్దన్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ గజ్జల శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

లెక్చరర్లకు ఆన్‌లైన్‌ శిక్షణ షురూ

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఈ విద్యాసంవత్సరం నుంచి మారిన పాఠ్యాంశాలపై జిల్లా అధ్యాపకులకు మూడు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణను మంగళవారం ప్రారంభించినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9న తెలుగు, హిందీ, 10న సివిక్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, కామర్స్‌, 11న సైన్స్‌, గణితం అంశాలపై సంబంధిత విషయ నిపుణులతో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠ్యాంశాలు, ప్రశ్న పత్రాలు, ప్రాక్టికల్స్‌ మార్కుల విభజన తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అంతర్గత మూల్యాంకనం ద్వారా 20 మార్కులు కేటాయిస్తున్నారని, ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, అన్ని కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విషయ నిపుణులు శ్రీనివాస శర్మ, ఆనంద్‌ కుమార్‌, కేశవ్‌ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పీఏసీఎస్‌ సీఈఓ సస్పెన్షన్‌

దుగ్గొండి: విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలిగించడానే కారణంతో మండలంలోని మహ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ రమేష్‌ను జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. ప్రభుత్వం రైతుల నుంచి మక్కలు, ధాన్యం సేకరిస్తున్న క్రమంలో రైతులకు సరైన విధంగా సేవలు అందించక పోగా ఇబ్బందులకు గురిచేశాడని, అలసత్వం ప్రదర్శించడంతో రైతులకు సరుకు అమ్మిన డబ్బులు వారి ఖాతాలలో జమకాలేదని, ఫలితంగా సకాలంలో పెట్టుబడికి డబ్బులు అందని పరిస్థితి వచ్చిందని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement