మోహన్‌నాయక్‌పై ఇక్కడా ఆరా! | - | Sakshi
Sakshi News home page

మోహన్‌నాయక్‌పై ఇక్కడా ఆరా!

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

మోహన్‌నాయక్‌పై ఇక్కడా ఆరా!

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రోడ్లు–భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ జె.మోహన్‌నాయక్‌ అక్రమాస్తులపై సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. మంగళవారం ఉమ్మడి వరంగల్‌లోనూ ఆరా తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌తోపాటు బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారి కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన లావాదేవీలపై అందిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడం స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఎవరీ మోహన్‌నాయక్‌..?

మోహన్‌నాయక్‌ తెలంగాణ ఆర్‌అండ్‌బీ శాఖలో అత్యంత కీలకమైన ‘ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ (స్టేట్‌ రోడ్స్‌)’ హోదాలో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఆర్‌డీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చేపడుతున్న అనేక రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు, డబుల్‌ రోడ్లు, బ్రిడ్జిలు, అభివద్ధి పనులు స్టేట్‌ రోడ్స్‌ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వరంగల్‌–ములుగు, వరంగల్‌–నర్సంపేట, వరంగల్‌–మహబూబాబాద్‌ తదితర ప్రధాన రహదారి పనుల పర్యవేక్షణలో ఆయన కార్యాలయానికి కీలక పాత్ర ఉంది. ఈఎన్‌సీ పదోన్నతికంటే ముందు ఉమ్మడి వరంగల్‌ ఎస్‌ఈగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. దీంతో మోహన్‌నాయక్‌ పేరు ఉమ్మడి వరంగల్‌లోని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ వర్గాలకు సుపరిచితం.

తాజాగా రూ. 6 లక్షల వసూలు..

కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే..

గ్రేటర్‌ వరంగల్‌ను కలుపుకునే ఉండే ఓ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఓ ఎర్త్‌వర్క్‌ (తారు వేసే ముందు)(మట్టి పనికి) సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టర్‌కు భారీగా లాభం జరిగేలా అంచనాలు పెంచినట్లు తెలుసుకున్న సదరు ఈఎన్‌సీ హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆగమేఘాల మీద ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్టర్‌నుంచి కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే రూ.6 లక్షలు తీసుకోవడంపై ఇప్పుడు ఆర్‌అండ్‌బీ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల నుంచి పనుల బిల్లులు, అనుమతులు, కాలపరిమితి పొడిగింపుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది.

అర్హత లేని కాంట్రాక్టర్‌కు భారీ పనులా?

వరంగల్‌లో ఎస్‌ఈగా పనిచేసిన కాలంలో ఉన్న పరిచయాలతో అర్హత ప్రమాణాలు పూర్తిగా లేని ఓ కాంట్రాక్టర్‌కు సుమారు రూ.60 కోట్ల విలువైన రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు ఏడాది కింద అప్పగించారన్న ఫిర్యాదులున్నా యి. ఆ రూ.60 కోట్ల పనికి టెండర్‌ అయిన సమయంలో అంతే విలువ గల పనులకు రెండేళ్లు కాలపరిమితి ఇచ్చి.. సదరు కాంట్రాక్టర్‌కు మూడేళ్లు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా పనుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక అనుమతులతో గడువు పెంచి పనులు కొనసాగించేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన పాత రికార్డులు, టెండర్‌ పత్రాలను విచారణ సంస్థలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇంజనీరింగ్‌ అధికారులకు కీలక పోస్టింగులు, బదిలీలు, పనుల కేటాయింపుల్లో మోహన్‌నాయక్‌ ప్రభావం చూపారనే ప్రచారం ఆ శాఖలో సాగుతోంది. దీంతో ఏసీబీ దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఆ వర్గాల్లో నెలకొంది.

చర్చనీయాంశంగా ఆర్‌అండ్‌బీ

ఈఎన్‌సీపై ఏసీబీ దాడులు

ఉమ్మడి వరంగల్‌లో రోడ్ల విస్తరణ, నిర్మాణ టెండర్ల నుంచి ఎర్త్‌వర్క్‌ల వరకు ఆరోపణల జాబితా

తాజాగా రూ.6 లక్షలు వసూలు?

కిందిస్థాయి అధికారుల్లో చర్చ

ఉమ్మడి వరంగల్‌లో నాలుగేళ్లు ఎస్‌ఈగా సేవలు

Advertisement
 
Advertisement
Advertisement