లాక్ష్‌ ఫౌండేషన్‌తో ఆర్ట్స్‌ కళాశాల ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

లాక్ష్‌ ఫౌండేషన్‌తో ఆర్ట్స్‌ కళాశాల ఎంఓయూ

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

లాక్ష్‌ ఫౌండేషన్‌తో ఆర్ట్స్‌ కళాశాల ఎంఓయూ కళాశాలల ఎంపికలో జాగ్రత్త కానిస్టేబుల్‌ కుటుంబానికి బీమా చెక్కు అందజేత యాప్‌తోనే యూరియా విక్రయించాలి : డీఏఓ

కేయూ క్యాంపస్‌: బెంగళూరుకు చెందిన లాక్ష్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థతో యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూతో వివిధ కంపెనీలతో నేరుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుందని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎల్‌.జితేందర్‌ తెలిపారు. లాక్ష్‌ ఫౌండేషన్‌ సహకారంతో కెరీర్‌ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యసన కార్యక్రమాలు కూడా ఉంటాయని వివరించారు. లాక్ష్‌ ఫౌండేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్లేస్‌మెంట్‌ మేనేజర్‌ వైద్యం రవికుమార్‌, సీనియర్‌ మేనేజర్‌ సునీల్‌ నుంచి కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి ఒప్పంద పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రహమాన్‌, సాయిచరణ్‌, గిరిప్రసాద్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ సూచించారు. నిట్‌ అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో మంగళవారం విద్యార్థులు సందడి చేశారు. జోసా–26 (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్‌ కార్యక్రమాన్ని నిట్‌ డైరెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నిట్‌, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, మిగతా ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్‌ దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చాయిస్‌ ఆఫ్‌ ఫిల్లింగ్‌లో తప్పులు చేయకుండా వివిధ కళాశాలలపై అవగాహన కల్పించేందుకు ఓపెన్‌హౌస్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిట్‌లో అత్యుత్తమ విద్యాబోధన, ల్యాబ్స్‌, సౌకర్యాలు, ప్లేస్‌మెంట్స్‌పై విద్యార్థుల సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీన్‌ అకడమిక్‌ వెంకయ్యచౌదరి, ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వరంగల్‌ క్రైం: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్‌ కుటుంబానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ చేతుల మీదుగా మంగళవారం ప్రమాద బీమా చెక్కు అందజేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.సతీశ్‌ గత సంవత్సరం మే 15న స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు మరణించిన కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులకు సీపీ చేతుల మీదుగా రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు. కానిస్టేబుల్‌ కుటుంబానికి బెనిఫిట్స్‌ త్వరగా అందజేయాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ సంధ్య, సహాయకురాలు తులసి పాల్గొన్నారు.

పరకాల: లైసెన్స్‌ లేకుండా విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఏఓ విజయ్‌చంద్ర హెచ్చరించారు. డీలర్లు యూరియాను ప్రభుత్వ యాప్‌ ద్వారా మాత్రమే విక్రయించాలని, తమ వద్ద ఉన్న స్టాక్‌ను యాప్‌లో వెంటనే నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. పరకాల డివిజన్‌ పరిధిలోని విత్తనాలు, పురుగు మందుల డీలర్లకు వానాకాలం సమాయత్తం కార్యక్రమాన్ని పరకాల రైతు వేదికలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చోట లైసెన్స్‌ తీసుకొని మరోచోట షాపులు నిర్వహించినా, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విత్తనాల అమ్మకాల్లో లాట్‌ నంబర్‌ నమోదు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పరకాల ఏడీఎ ఆదిరెడ్డి, పరకాల డివిజన్‌లోని అన్ని మండలాల వ్యవసాయాధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement