కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ‘బిగ్ బాస్’ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. బదిలీల ప్రక్రియ మూడు రోజులనుంచి కొనసాగుతున్నా సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కావడం లేదు. వాస్తవానికి ఇంత పెద్ద ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టు లేనే లేదు. అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్ పోస్టు ఉండాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ పోస్టు లేనందున మొదటినుంచి సీనియర్ ప్రొఫెసర్లను ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్లుగా నియమిస్తూ వస్తున్నారు.
ముందుకు రాని సీనియర్ ప్రొఫెసర్లు..
గతంలో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ హోదాలో ఉన్న డాక్టర్ హరీష్‌చంద్రారెడ్డి మంగళవారం ఎంజీఎం బాధ్యతలనుంచి రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం, కేఎంసీలో సీనియర్లుగా ఉన్న ప్రొఫెసర్లు ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. సీనియర్ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ రాంకుమార్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని ఊహించారు. ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో దూరంగా ఉన్నట్లు తెలిసింది. మూడు రోజులనుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రోగులకు వైద్యసేవలు ఏ విధంగా అందుతున్నాయో పర్యవేక్షణ చేసేవారు లేకుండాపోయారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీఓ జారీ చేసిన త ర్వాత కొత్త ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకరిద్దరు ప్రొఫెసర్లు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
మినిస్టీరియల్, నర్సింగ్ విభాగంలో
అంతంతమాత్రమే..
మినిస్టీరియల్ నర్సింగ్ విభాగంలో ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది అంతంతమాత్రంగానే జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో 13 మంది సీనియర్ అసిస్టెంట్లు అవసరం ఉండగా, ఆరుగురు ఉండేవారు. వీరిలో ముగ్గురు బదిలీపై వెళ్లగా ఇక ముగ్గురు ఉద్యోగులు మిగిలారు. ప్రస్తుతం 10 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ విభాగంలో దాదాపు 160 మంది ఉండాలి. ఇప్పటివరకు 35 మంది మాత్రమే జాయిన్ అయినట్లు సమాచారం. చాలామంది ఉద్యోగులు, నర్సింగ్ స్టాఫ్ విధుల్లో చేరేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.
మూడు రోజులుగా
ఇన్‌చార్జ్ లేకుండానే పాలన
బాధ్యత తీసుకోవడానికి
ముందుకు రాని ప్రొఫెసర్లు
బదిలీల్లో మినిస్టీరియల్, నర్సింగ్ పోస్టులు భర్తీకాని పరిస్థితి..


