ఆత్మకూరు: నకిలీ విత్తనాలతో మోసపోయామని నాగయ్యపల్లె రైతులు ఆత్మకూరు ఎస్సై తిరుపతికి మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. నాగయ్యపల్లి గ్రామ రైతులకు ఫైనీర్ 915 మేల్, ఫిమేల్ కంపెనీ ఆర్గనైజర్లు కొడారి సమ్మయ్య, ఇందూరి మచ్చేందర్, కొన్నే సూరయ్య సమావేశాలు పెట్టి మేల్, ఫిమేల్ వరి విత్తనాలు వేస్తే తామే క్వింటాలుకు రూ.3600తో కొనుగోలు చేస్తామని చెప్పి నమ్మించారు. తాము ఇచ్చే విత్తనాలతో ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ చూపడంతో 160 ఎకరాల్లో మేల్, ఫిమేల్ నకిలీ విత్తనాలను రైతులు సాగు చేశారు. ఎకరాకు 10 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి మాత్రమే వచ్చింది. ఫైనీర్ 915 కంపెనీ ఆర్గనైజర్లకు ఫోన్ చేసి రైతులు జరిగిన నష్టాన్ని వివరించారు. తాము వచ్చి పంటను పరిశీలించిన తర్వాత న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. గడువులోగా రాకపోవడంతో తిరిగి మళ్లీ ఫోన్ చేస్తే మేం చేయలేం, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండని దబాయించారని రైతులు నేరెళ్ల రమణారెడ్డి, ఎన్.రవీందర్, రాజేందర్, మాదాసి కర్ణాకర్, కరుణాకర్‌రెడ్డి, విజేందర్, గుండాల క్రాంతి సురేశ్, సాంబరాజు, రమేశ్, మహేందర్, పురం కుమారస్వామి, ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్గనైజర్లు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పంటను రూ.3,600కు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి రూ.2,800 చొప్పునే కొనుగోలు చేసి ఆర్థికంగా దెబ్బతీశారని ఎస్సై ఎదుట వాపోయారు. కంపెనీ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకొని పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరారు.
ఫైనీర్ 915 కంపెనీ నుంచి
పరిహారం ఇప్పించండి
ఎస్సై తిరుపతికి నాగయ్యపల్లె
రైతుల ఫిర్యాదు


