గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

ఖానాపురం: గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఖానాపురం గ్రామసభలో ఆమె మాట్లాడారు. రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తే అనేక ఉపయోగాలు ఉంటాయని, పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ నంగునూరి రమేశ్‌, ఎంపీడీఓ అద్వైత, సర్పంచ్‌ దాసరి రమేశ్‌, పశువైద్యాధికారి శ్రీకాంత్‌, ఏఈ స్వాతి, పీహెచ్‌సీ వైద్యాధికారి జ్యోతి, గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్‌ సుబ్బారావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమ, ఉపసర్పంచ్‌ రాజు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘యూ–విన్‌’లో నమోదు తప్పనిసరి : డీఎంహెచ్‌ఓ

గీసుకొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సంస్థలు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యూ–విన్‌ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.సాంబశివరావు అన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ గర్భిణుల నమోదు, ప్రసవాలు, జనన సమయంలో ఇచ్చే టీకాల వివరాలను యాప్‌లో సకాలంలో నమోదు చేస్తే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. ఏరోజు వివరాలను ఆ రోజు వివరాలను నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ను నియంత్రించాలి

నల్లబెల్లి: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా పంచాయతీ అధికారి కె.కల్పన అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగాపురంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్‌ను నియంత్రించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, సురక్షిత తాగునీటి సఫరాపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణను పరిశీలించారు. వనమహోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రవి, సర్పంచ్‌ ఓరుగంటి మాధురి రాజు, ఉపసర్పంచ్‌ కస్తూరోజు రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శి రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రమణ, హెచ్‌ఓ జ్యోతి, హెచ్‌ఎం యాకూబ్‌రెడ్డి, జీపీఓ శ్యాం తదితరులు పాల్గొన్నారు.

మామిడికాయల

పంచాయితీ

నర్సంపేట రూరల్‌: మామిడికాయల కోసం పంచాయితీ ఇరువర్గాల పరస్పర దాడులకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన గాదెగోని రాజు, పక్కింటికి చెందిన తెప్ప చిరంజీవి, తెప్ప రాజయ్య, కొమురయ్య, రమేశ్‌ ఇళ్ల మధ్యలో మామిడి చెట్టు ఉంది. చెట్టు కాయలను చిరంజీవి కోయగా.. గాదెగోని రాజు ఎందుకు కాయలు కోశావని ప్రశ్నించాడు. ఈక్రమంలో ఇరుకుటుంబాలు మాటమాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరువర్గాలు శనివారం రాత్రి నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఈవిషయమై ఎస్సై గూడ అరుణ్‌ను వివరణ కోరగా మామిడి కాయల విషయంలో గొడవ పడి పరస్పరం దాడులు చేసుకుని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement