కాశిబుగ్గ: దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ ఓసిటీ నుంచి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ర్యాలీని శుక్రవారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఽథీమ్ ‘ప్రకృతి నుంచి ప్రేరణ’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ వంటి ఇంధనంపై ఆధారపడకుండా, గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆమె సూచించారు. పూర్వీకులు వాడిన మట్టి కుండలు, మట్టి పాత్రలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రిటైర్డు ఆఫీసర్ పురుషోత్తం, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, జెడ్సీ సీఈఓ రాంరెడ్డి, టి.శ్రవణ్‌కుమార్, ఎ.సంపత్‌కుమార్, వి.శ్రీనివాస్, భగవాన్, వెంకన్న, మండల పరశురాములు, రాజగోవింద్, డాక్టర్ సాంబమూర్తి, డాక్టర్ కొణతం కృష్ణ, ఫైజల్ రహమాన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


