● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
● ఒగ్లాపూర్, ఊరుగొండ,
ల్యాదెళ్లలో పర్యటన
దామెర: ప్రజాపాలనతో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. దామెర మండలం ఒగ్లాపూర్, ఊరుగొండ, ల్యాదెళ్లలో గురవారం కలెక్టర్ పర్యటించారు. ఇందులో భాగంగా.. ఒగ్లాపూర్‌లో డంపింగ్ యార్డును పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం ఊరుగొండ గ్రామ సభలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం బడి బాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 300కుపైగా విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ల్యాదెళ్ల స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్రమాల్లో డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఈఓ గిరిరాజ్, అడిషనల్ డీఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఎంఈఓ జుమ్ము, డీపీఎం రాజేంద్రప్రసాద్, సర్పంచ్‌లు కేతిపల్లి శ్రీధర్‌రెడ్డి, పొలెపాక శ్రీనివాస్, బొంకూరి రవియాదవ్, ఊరుగొండ ఉపసర్పంచ్ నంద్యాల శ్రావణ్‌రెడ్డి, వివిధ శాఖల అఽధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పంట అవశేషాలు కాల్చడం నిషేధం
హన్మకొండ అర్బన్ : జిల్లాలో పంట అవశేషాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు నేల సారవంతం తగ్గడం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన వల్ల ప్రజారోగ్యానికి, ప్రాణాలకు ముప్పు వాటిల్లితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రైతులు పంట అవశేషాల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


