మధ్యవర్తులను మందలించండి | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తులను మందలించండి

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

మధ్యవర్తులను మందలించండి

వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

హసన్‌పర్తి : భూ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించే వారిని మందలించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, ఏసీపీ నర్సింహారావు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ సీపీకి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు, బాలమిత్ర పోలీస్‌ స్టేషన్‌, క్రీడా మైదానాన్ని సీపీ పరిశీలించారు. రౌడీషీటర్లు, అనుమానితుల రికార్డులు పరిశీలించి స్టేషన్‌ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ.. తగదాల్లో సెటిల్‌మెంట్లు చేసే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. రౌడీషీటర్లపై సానుభూతి ప్రదర్శించొద్దన్నారు. విద్యాసంస్థల్లో సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సై నవీన్‌, కళ్యాణ్‌ కుమార్‌, రాజమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement