కాంగ్రెస్‌ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదు జిల్లాల చైర్మన్లు వీరే..

కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్‌గా అరూరి సాంబయ్య, వరంగల్‌ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్‌, జనగామకు చేపూరి వినోద్‌, మహబూబాబాద్‌కు తిప్పర్తి శ్రీధర్‌, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిని నియమించారు. జాబితాలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, కాంగ్రెస్‌ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో?నన్న చర్చ మొదలైంది.

అదనపు కలెక్టర్‌గా కిశోర్‌కుమార్‌

న్యూశాయంపేట: జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను జిల్లాకు బదిలీ చేసింది. జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)గా పనిచేస్తున్న జి.సంధ్యారాణిని నిర్మల్‌ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జాతీయస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు నాగరాజు

సంగెం: జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ బేస్‌బాల్‌ పోటీలకు మొండ్రాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.విజయ, పీడీ ముఖర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 28 నుంచి 30 వరకు నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో విద్యార్థి అనుముల నాగరాజు పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 9 నుంచి 20 వరకు మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో జరిగిన తెలంగాణ జట్టు సబ్‌ జూనియర్‌ బేస్‌బాల్‌ క్యాంపులో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 24 నుంచి 29 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో గల కిట్టు యూనివర్సిటీలో జరిగే 31వ సబ్‌జూనియర్‌ బేస్‌బాల్‌ నేషనల్‌ టోర్నమెంట్‌లో నాగరాజు పాల్గొననున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న నాగరాజును సర్పంచ్‌ గూడ స్వరూప, ఉపసర్పంచ్‌ విజయ్‌, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌ శ్రీలత, హెచ్‌ఎం విజయ, పీడీ ముఖర్జీ, ఉపాధ్యాయులు అభినందించారు.

కేజీబీవీలో అడ్మిషన్లు

సంగెం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రత్యేకాధికారిణి కె.నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ మొదటి సంవత్సరంలో 40 సీట్లు, సీఈసీలో 40 సీట్లు భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన బాలికలకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులను కేజీబీవీలో చేర్పించాలని నీలిమ కోరారు.

‘టీబీ ముక్త్‌’పై సమీక్ష

న్యూశాయంపేట: టీబీ ముక్త్‌ అభియాన్‌–100 రోజుల ప్రచారం పురోగతిపై కేంద్ర, ఆరోగ్య, కుటంబ సంక్షేమ మంత్రిత్వశాఖ శుక్రవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించి జిల్లా అధికారులతో సమీక్షించింది. కేంద్ర టీబీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. టీబీ కేసుల గుర్తింపు, చికిత్స, పర్యవేక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపు వంటి అంశాలపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ప్రోగ్రాం అధికారి అరుణ్‌ జోషి పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

చెన్నారావుపేట: గురిజాల గ్రామానికి చెందిన గోలి రవీందర్‌ అనే వ్యక్తి టాటా బొలేరో వాహనంలో 60 బస్తాల (25 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం తరలిస్తుండగా శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం రూ.87,500 విలువ చేసే బియ్యం, వాహనం, నిందితుడు గోలి రవీందర్‌పై కేసు నమోదు చేసి చెన్నారావుపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ బాబులాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement