సాగులో సబ్సిడీ పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో సబ్సిడీ పెంచాలి

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

తెలంగాణ రైతు సంఘం

రాష్ట్ర కోశాధికారి మూడ్‌ శోభన్‌

నర్సంపేట: పంటలకు మద్దతు ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్‌ శోభన్‌ ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని రైతు సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్‌ మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం సమగ్ర సాగు వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి (సీ2+50) శాతం మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తక్కువగా ఉండే ఏ2+ఎఫ్‌ఎల్‌ (పెట్టిన పెట్టుబడి+కుటుంబ శ్రమ విలువ) విధానం ఆధారంగానే ధరలను నిర్ణయించిందన్నారు. దీని వల్ల రైతులు ప్రతి క్వింటాలుపై భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పంటల సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. వ్యవసాయంలో సబ్సిడీలను పెంచి కార్పొరేట్‌ అనుకూల విధానాలను ఉపంసహరించుకోవాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపల్లి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొరబోయిన కుమారస్వామి, చల్లా నర్సింహారెడ్డి, అన్వర్‌, ఇస్లావత్‌ నెహ్రూ, అక్కెపల్లి సుధాకర్‌, చల్ల మల్లయ్య, గోనె మల్లారెడ్డి, కోడెం రమేశ్‌, లక్క రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement