మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
బాధ్యతలు ఎవరికో?
భర్తీలో
జాప్యం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం అస్తవ్యస్తంగా మారింది. కీలకమైన ఈ కార్యాలయంలో రెగ్యులర్ డీఈఓ లేక ఇన్‌చార్జ్‌ల పాలనలో అవినీతి ఆరోపణలతో రచ్చకెక్కింది. మరోవైపు ఈనెల 5న ఎఫ్‌ఏసీ డీఈఓగా ఉన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకటరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఎండీ గౌస్, జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ఓప్రైవేట్ యాజమాన్యం నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈక్రమంలో జిల్లా విద్యాశాఖను చక్కదిద్దేదెవరు అని ప్రస్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది.
స్తంభించిన కార్యకలాపాలు
హనుమకొండ జిల్లా విద్యాశాఖలో కొంత కాలం క్రితం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇక్కడికి వచ్చిన సత్యనారాయణ కొద్దిరోజులకు యాదాద్రి డీఈఓగా వెళ్లిపోయారు. కీలకమైన అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోవడంతో అన్ని డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించేవారే వివిధ రకాల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల చివరన ఉద్యోగుల బిల్లులకు సంబంధించిన ఫైల్‌పై మాత్రం ఏడీ సత్యనారాయణతోనే సంతకం చేయించుకునే పరిస్ధితి కొనసాగుతోంది. డీఈఓ కార్యాలయంలో మిగతా అన్ని సెక్షన్లపైనా ఏడీ పర్యవేక్షించాల్సి ఉంటోంది. అలాంటి ఏడీగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించే వారులేక ఉద్యోగులపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే మారింది.
సెలవుపై సూపరింటెండెంట్లు
జిల్లా విద్యాశాఖ అఽధికారి కార్యాలయంలో కీలకమైన ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ ఇటీవల ఆరునెలలు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పట్లో ఆయన విధుల్లో చేరే పరిస్థితి లేదు. దీంతో ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో టీచింగ్, నాన్‌టీచింగ్, స్కూల్ అసిస్టెంట్, హెడ్మాస్టర్స్, ఎస్జీటీల సర్వీస్ మ్యాటర్లుకు సంబంధించిన విధులు ఉంటాయి. అలాగే మధ్యాహ్న భోజన పథ కం, ఆర్టీఐ విధులకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆయా అంశాల్లో ఏదైనా ఫైల్‌ను జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మూవ్ చేసినప్పడు పరిశీలించి పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌పై ఉంటుంది. ఏదైనా ఫైల్‌పై సూపరింటెండెంట్ సంతకం చేశాకే డీఈఓ వద్దకు ఫైల్‌ను తీసుకెళ్తారు. ఆఫైల్‌ను క్లియర్ చేయాలనుకున్నప్పు డు డీఈఓ సూపరింటెండెంట్ చెప్పే వివరణ అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన పరిధిలోనూ పలువురు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు.
పెండింగ్‌లోనే ఫైళ్లు..
సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడంతో ఆవిభాగంలో ఫైళ్ల క్లియరెన్స్ నిలిచిపోయినట్లు భావిస్తున్నారు. కాగా, డీఈఓ కార్యాలయంలో మరో కీలకమైన అకౌంట్స్ విభాగంలోనూ సూపరింటిండెంట్‌గా ఉన్న శైలజ అనారోగ్య సమస్యలతో గత 40 రోజులుగా సెలవుపై వెళ్లినట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విభాగంలో అకౌంట్స్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఎయిడెడ్ సెక్షన్, సమగ్ర శిక్ష, మెడికల్ రీయింబర్స్‌మెంట్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఈ సూపరింటెండెంట్ పర్యవేక్షణ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు పెట్టే ఫైళ్లను పరిశీలించి తాను సంతకం చేసి డీఈఓ వద్దకు తీసుకెళ్లి క్లియర్ చేసే బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. సూపరింటెండెంట్ శైలజ కూడా సెలవులో ఉండడంతో ఆ విభాగంలోని కార్యకాలాపాలు కూడా ఫైళ్ల క్లియరెన్స్ కావడం లేదని తెలుస్తోంది. ఈ సూపరింటెండెంట్ పరిధిలో కూడా పలువురు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుంటారు.
డిప్యుటేషన్ల పరంపర
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు ఉండగా.. ఒక సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డారు. ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ డైట్ కళాశాల నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న మనోజ్ గత కొంతకాలం క్రితం డిప్యుటేషన్‌పై డీఈఓ కార్యాలయంలో పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. మరో పది మంది జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ చోట్ల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్షలో ఆరుగురు ఉపాధ్యాయులు, ఓపెన్ స్కూల్‌లో మరో ఉపాధ్యాయుడు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. పలువురు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏఓ) కూడా వేరే శాఖ నుంచి ఫారిన్ డిప్యుటేషన్‌పై డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయనకు జయశంకర్ భూపాలపల్లి డీఈఓ కార్యాలయంలో కూడా అదనపు ఇన్‌చార్జ్ ఏఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అవినీతికి కేరాఫ్‌గా మారిన జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఎవరు చక్కదిద్దుతారు? అనే ప్రశ్న ఉపాధ్యాయ వర్గాల్లో రేకెత్తుతోంది. వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్యనారాయణరెడ్డిని అదనపు బాధ్యతలతో నియమిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. కానీ, ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఆయన హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాల, ప్రభుత్వ డైట్ కళాశాలలకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా కూడా ఆయనే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ డీఈఓ కార్యాలయం ఏడీగా ఉండి యాదాద్రి జిల్లా డీఈఓగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సత్యనారాయణను అక్కడి నుంచి ఎఫ్‌ఏసీ డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తారా? అనేది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్కడ యాదాద్రి జిల్లాలో మరో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. హనుమకొండ జిల్లాలోనే వేరే శాఖ నుంచి ఏ అధికారికై నా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేక రాష్ట్రంలోని వేరే జిల్లా నుంచి ఎవరికై నా అవకాశం ఇస్తారా? అనేది వేచి చూడాలి.
హనుమకొండ జిల్లా
విద్యాశాఖలో స్తంభించిన
కార్యకలాపాలు
సూపరింటెండెంట్లు సెలవులో.. ఏడీ యాదాద్రి డీఈఓగా..
ఏసీబీకి చిక్కిన జిల్లా
ఇన్‌చార్జ్ డీఈఓ
ఆ స్థానం
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


