ఒక్కసారి అవకాశం ఇవ్వండి!
సంగెం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గతంలో ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా పనిచేసిన వారు ఈసారి సైతం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. విజయం తమను వరించకపోతుందా అని మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి తమను కరుణించాలని ఓటర్లను కలిసి ప్రాధేయపడుతున్నారు. ప్రత్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడిస్తే ఐదేళ్ల వరకు వారి బెడద తప్పుతుందని భావిస్తున్న నాయకులు అందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. పైసామే పరమాత్మ అన్నట్లు.. ప్రస్తుతం పంచాయతీ ఎన్నిల పుణ్యమా అని గ్రామాల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విందులు ఇస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు.
ఉదయం, సాయంత్రం మంతనాలు..
గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉదయం, సాయంత్రం ఓటర్ల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరుపుతున్నారు. తటస్థ ఓటర్లకు తాయిళాలు ఎర చూపి తమ వైపునకు తిప్పుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. ఇక ప్రచారంలో తమ వెంట తిరిగే పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు రాత్రి అయ్యిందంటే చాలు విందులు, దావత్‌లు ఇస్తున్నారు. లేదంటే అవతలి వైపు వెళ్లే ప్రమాదం ఉండడంతో ముందస్తుగానే అప్రమత్తం అవుతున్నారు.
కుల సంఘాల మద్దతు కోసం...
సర్పంచ్ ఎన్నిలపై కుల సంఘాల ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వివిధ కుల సంఘాల పెద్ద మనుషులతో అభ్యర్థులు చర్చలు కొనసాగిస్తున్నారు. తాము పోటీ చేసే గ్రామంలో ఏ కుల సంఘాల ఓట్లు ఎక్కువగా ఉంటే ఆకుల సంఘాలను ఆకట్టుకునే యత్నాలు మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఒకే కులం వారు ఇద్దరు బరిలో ఉంటే ఆ సంఘం వారు ఎవరికి మొగ్గు చూపుతారో వారికే గెలుపు అవకాశాలుంటాయని, వేర్వేరు కులాల వారు బరిలో నిలిస్తే ఎక్కువ ఓట్లు ఉన్న కులం మద్దతు ప్రకటిస్తే గెలుపు ఖాయమనే ధీమాతో వారి మద్దతు కూడగట్టుకుంటూ విందులు చేస్తున్నారు.
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయాలు..
గ్రామాల్లో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత గుర్తులపై జరుగుతాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ గేలుపే ధ్యేయంగా ముందుకుపోతున్నారు.
ఓటర్ల ప్రసన్నానికి అభ్యర్థుల పాట్లు
ఈసారి కరుణించాలని వేడుకోలు
తటస్థ ఓటర్లకు తాయిలాల ఎర


